రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్, వైద్య, విద్య సంచాలకుడు రమేశ్‌రెడ్డి
ఖనిలో వైద్య కళాశాల కోసం స్థల పరిశీలన
సర్కారు దవాఖాన, సింగరేణి హాస్పిటల్, పవర్‌హౌస్ ప్రాంతాన్ని పరిశీలించిన బృందం సభ్యులు
కలెక్టర్‌తో సమీక్ష
ఫర్టిలైజర్‌సిటీ, సెప్టెంబర్ 5: పేదలకు కార్పొరేట్ తరహా వైద్యం అందించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్, వైద్యవిద్య సంచాలకుడు రమేశ్‌రెడ్డి స్పష్టం చేశారు. రామగుండం నియోజకవర్గంలో వైద్య కళాశాల ఏర్పాటు కోసం డా.రమేశ్‌రెడ్డి బృందం ఆదివారం గోదావరిఖనిలోని పలు ప్రాంతాలను పరిశీలించారు. మొదట గోదావరిఖని ప్రభుత్వ దవాఖానలోని ఆపరేషన్ థియేటర్, జనరల్ వార్డు, ఆర్థో విభాగం, ఓపీ విభాగం, అత్యవసర విభాగాన్ని పరిశీలించారు. అనంతరం సింగరేణి ప్రధాన దవాఖానను పరిశీలించారు. అనంతరం నూతన వైద్య కళాశాల ఏర్పాటుకు ప్రతిపాదించిన సింగరేణికి చెందిన 15 ఎకరాల పవర్‌హౌస్ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో నిర్మించనున్న భవనాలు, వసతి గృహాలు తదితర అంశాలను జీఎం కల్వల నారాయణను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రమేశ్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నగరాలకు పరిమితమైన సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని గ్రామీణ ప్రాంతాలకు కూడా చేరాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలోని 8 జిల్లాల్లో నూతన వైద్య కళాశాలలను మంజూరు చేశారన్నారు.
గోదావరిఖనిలో సైతం ఏర్పాటు చేసేందుకు తాము ఈ సర్వేకు వచ్చినట్లు తెలిపారు. వైద్య కళాశాల అందుబాటులోకి వస్తే సుమారు 500 పడకల వైద్యశాలతోపాటు అత్యవసర చికిత్సలు ఇక్కడే అందుతాయని తెలిపారు. అనంతరం ఇల్లందు అతిథి గృహంలో కలెక్టర్ సర్వే సంగీతా సత్యనారాయణతో కలిసి బృందం సభ్యులు మెడికల్ కాలేజీ భవన నిర్మాణానికి సంబంధించి అనువైన స్థల ఎంపిక కోసం సమీక్ష నిర్వహించారు. సింగరేణి, రెవెన్యూ అధికారులతో సర్వే నిర్వహించి మెడికల్ కాలేజీ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని రేపటివరకు ఎంపిక చేసి ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని కలెక్టర్ తెలిపారు. అంతకుముందు మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం స్థల పరిశీలనకు హైదరాబాద్ నుంచి సీఎం ఓఎస్డీ డా.గంగాధర్ ఆధ్వర్యంలో వచ్చిన బృందానికి కలెక్టర్ స్వాగతం పలికారు. ఇక్కడ బృందం సభ్యులు రాష్ట్ర వైద్య మౌలిక వసతుల కల్పన సంస్థ ఎండీ చంద్రశేఖర్, సీఈ రాజేంద్ర కుమార్, వైద్యులు రాంబాబు నాయక్, ఆర్డీవో శంకర్ కుమార్, డీసీహెచ్ఎస్ వాసు దేవరెడ్డి, జిల్లావైద్యాధికారి ప్రమోద్‌కుమార్, సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి, తాసీల్దార్ రమేశ్, జీఎం కే నారాయణ, డీజీఎం లక్ష్మీనారాయణ, డీవైసీఎం కిరణ్ రాజ్‌కుమార్, ఏరియా సేఫ్టీ అధికారి కేవీ రావు, ఎస్ఎస్వో వీరారెడ్డి తదితరులున్నారు.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులు
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సుమారు 510 కోట్ల వ్యయంతో గోదావరిఖనిలో వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు రామగుండం ఎమ్మెల్యేతోపాటు సీఎం ఇదివరకే ప్రకటించారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు సుమారు 15 ఎకరాల స్థలంలో సింగరేణి పాత 18 మెగావాట్ల స్థలంలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ వైద్యశాల ఏర్పాటుకు 100 పడకల ప్రభుత్వ దవాఖాన, 220 పడకల సింగరేణి ఆస్పత్రి, 50 పడకల ఎన్టీపీసీ వైద్యశాల ఈ కళాశాల పరిధిలోకి రానున్నాయి. అనుబంధంగా మరో నర్సింగ్ కళాశాల సైతం కళాశాల ఆవరణలో ఏర్పాటు చేయనున్నారు. రానున్న రోజుల్లో 2022-23 విద్యా సంవత్సరం నుంచే 150 మంది విద్యార్థుల కోసం ఈ వైద్య కళాశాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర బృందం పరిశీలించిన అంశాలను సీఎంకు విన్నవించిన అనంతరం కళాశాల ప్రారంభం కానున్నది. ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం వైద్య కళాశాలకు 20 ఎకరాల స్థలం ఆస్పత్రికి 5 ఎకరాల స్థలం, 330 పడకల ఆస్పత్రి ఉండాల్సిన అవసరం ఉంది. ఈమేరకు నగరంలోని 3 దవాఖానలను ఈ కళాశాల కిందకు తీసుకరానున్నారు.