ఆదివారం 01 నవంబర్ 2020
Kamareddy - Sep 28, 2020 , 03:35:20

అంతర పంట.. అన్నదాతకు భరోసా

అంతర పంట.. అన్నదాతకు భరోసా

గాంధారి: కామారెడ్డి జిల్లాలో చాలామంది రైతులు వర్షాధార పంటలు సాగుచేస్తున్నారు. కాలం అనుకూలిస్తేనే పంటలు చేతికి వస్తాయి. లేదంటే నష్టాన్ని చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వర్షంపై ఆధారపడి ఒకే రకమైన పంటను సాగుచేస్తే అతివృష్టి, అనావృష్టి, చీడపీడలతో పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. దీనిని దృషిలో ఉంచుకొని చాలామంది రైతులు అంతరపంటల సాగుపై దృష్టిసారిస్తున్నారు. దీంతో ప్రకృతి వైపరీత్యాలతో ఒక పంట నష్టపోయినా.. మరో పంటతో ఆ నష్టాన్ని పూడ్చుకొనే వీలు ఉంటుందనేది అన్నదాత ఆలోచన. 

జిల్లాలో అంతరపంటల సాగు ఇలా.. 

వ్యవసాయ భూముల్లో ఒకే రకమైన పంట సాగు చేయకుండా.. ఏకకాలంలో వేర్వేరు కాలపరిమితులతో కూడిన పంటలను సాగు చేయడాన్ని అంతర్‌పంటల సాగు అంటారు. కామారెడ్డి జిల్లాలోని గాంధారి, సదాశివనగర్‌, తాడ్వాయి, రామారెడ్డి, లింగంపేట్‌, బాన్సువాడ, బిచ్కుంద, పిట్లం, జుక్కల్‌, మద్నూర్‌, పెద్దకొడప్‌గల్‌ మండలాల్లో నల్లరేగడి, చెలుక, తరుక, దుబ్బ భూములు ఎక్కువగా ఉన్నాయి. ఈ భూముల్లో కేవలం వర్షాధారం ఆధారంగానే రైతులు పంటలను సాగు చేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోకుండా ఉండడానికి ఎక్కువ మంది రైతులు అంతరపంటల సాగుపై దృష్టి సారిస్తున్నారు. పత్తి, మక్కజొన్న, సోయా, కంది, మినుము, పెసర, మిరప, జొన్న సాగుచేసే రైతులు అంతర పంటల సాగుపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. పత్తి వేసే రైతులు అంతరపంటగా కంది, జొన్న వేసే రైతులు పప్పు దినుసులు, సోయా వేసే రైతులు మక్కజొన్న.. ఇలా ఒక పంటతో పాటు మరో పంటను కూడా సాగుచేస్తున్నారు. దీంతో అధిక దిగుబడులు సాధిస్తున్నారు. 

ఈ పంటలు అనుకూలం.. 

నల్లరేగడి భూముల్లో మొదటిపంటగా దేనిని సాగుచేసినా.. అందులో అంతరపంటగా కందిని సాగు చేసుకోవచ్చు. మక్కజొన్నతోపాటు సోయా, మినుము, పెసర పంటలు 90 రోజుల్లోనే చేతికి వస్తాయి. ఈ రకం పంటల్లో కందిని సాగుచేసుకోవడం అనుకూలంగా ఉంటుంది. పత్తి పంటలో ఐదు సాళ్లకు ఒకసాలు కంది పంటను, మక్కజొన్నలో ఆరు సాళ్లకు ఒక కంది సాలును, సోయా, మినుము, పెసర పంటల్లో అంతర పంటగా కొర్ర, జొన్న, ఆముదం ఐదారు సాళ్లకు ఒక సాలును వేసుకోవచ్చు. వీటితోపాటు రైతులు తాము సాగు చేస్తున్న పంటల్లో బీర, దోస, చిక్కుడు, తీగలతో పాటు మిరప, టమాటా, వంకాయ వంటి కూరగాయలను సాగుచేస్తే అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంది.  

అంతరపంటల సాగుతో లాభాలు ఇవీ.. 

  • ఏకకాలంలో రెండు పంటలను సాగుచేయడంతో ఒక పంటతో వచ్చిన నష్టాన్ని మరో పంటతో భర్తీ చేసుకోవచ్చు. 
  • సాగు భూముల్లో పోషకాల సామర్థ్యం పెరుగుతుంది. 
  • కలుపు మొక్కల బెడద ఉండదు. 
  • అంతరపంటల సాగుతో నేల కోతకు గురికాకుండా, భూసారాన్ని రక్షించుకోవచ్చు. 
  • ప్రధాన పంటలను ఆశించే చీడపీడల ఉధృతి తక్కువగా ఉంటుంది. 
  • అంతరపంటలు సాగుచేయడంతో పంటలకు గాలి, వెలుతురూ సరిగా తగిలి ఏపుగా పెరిగి.. దిగుబడి కూడా అధికంగా వస్తుంది. 
  • ప్రకృతి అనుకూలిస్తే రైతుకు రెండు పంటలతో అధిక లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. 
  • పప్పు జాతి పంటలను అంతరపంటగా సాగుచేస్తే.. వ్యవసాయ భూముల్లో భూసారం పెరుగుతుంది. 
  • అంతరపంటల సాగుతో కీటకాలకు పంటను గుర్తించడం కష్టంగా మారుతుంది. చీడపీడల బెడద ఉండదు. 
  • కౌలు రైతులకు భరోసా కలుగుతుంది.