NeoCov virus | ప్రపంచాన్ని గజగజ వణికించిన కరోనా వైరస్ అనేక రూపాంతరాలుగా మారుతున్న విషయం విదితమే. 2019 నుంచి నేటి వరకు ఈ మహమ్మారి ఆయా దేశాల్లో లక్షలాది మందిని బలి తీసుకున్నది. ఇక దక్షిణాఫ్రికాలో కరోనా వైరస్ కొత్త రూపాంతరం నియోకోవ్ బయటపడిందని వ్యూహాన్ శాస్త్రవేత్తలు హెచ్చరించిన విషయాన్ని రష్యన్ న్యూస్ ఏజెన్సీ స్పుత్నిక్ వెల్లడించింది.
ఈ కొత్త వైరస్ నియోకోవ్ వ్యాప్తి కూడా అధికంగా ఉంటుందని వ్యూహాన్ శాస్త్రవేత్తలు పేర్కొన్నట్లు తెలిపింది. మరణాల సంఖ్య కూడా అధికంగా నమోదు అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నది. వైరస్ సోకిన వారిలో ప్రతి ముగ్గురిలో ఒకరు మృతి చెందే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
నియోకోవ్ వైరస్ అనేది కొత్తది కాదు అని పేర్కొన్న శాస్త్రవేత్తలు.. మెర్స్-కోవ్ వైరస్ రకానికి చెందినదే అని స్పష్టం చేశారు. మధ్య ప్రాచ్య దేశాల్లో 2021-15 మధ్య కాలంలోనే నియోకోవ్ వైరస్ను కనుగొన్నట్లు తెలిపారు. ఈ మెర్స్-కోవ్ రకం కూడా మనుషుల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సార్స్-కోవ్-2 రకంతో సరిపోలుతుంది అని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
నియోకోవ్ వైరస్ను మొదటిసారిగా దక్షిణాఫ్రికాలో గబ్బిలాల్లోనే గుర్తించారు. అయితే గబ్బిలాల జనాభాలోనే ఈ వైరస్ వ్యాప్తి చెందుతోందని భావించినప్పటికీ, కానీ, తాజా పరిశోధనలో మాత్రం నియోకోవ్తో పాటు దాని దగ్గరి అనుబంధ వైరస్ పీడీఎఫ్-2180-కోవ్ మనుషులకూ వ్యాప్తి చెందుతుందని తేలింది. ఈ పరిశోధన వివరాలను bioRxiv అనే వెబ్ సైట్లో ప్రచురించారు.