పారిస్, నవంబర్ 22: అడవుల్లో వన్యప్రాణుల కదలికలను గుర్తించేందుకు ఏర్పాటుచేసే కెమెరాలు, ఇతర నిఘా పరికరాలు మహిళలపై వేధింపులకు కారణమవుతున్నాయని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుడి అధ్యయనంలో తేలింది. ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్‌పై త్రిశాంత్ సిమ్లయ్ అనే పరిశోధకుడు 14 నెలల పాటు అధ్యయనం చేశారు.
వన్యప్రాణుల కదలికలను తెలుసుకునేందుకు టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో కెమెరాలను ఏర్పాటు చేశారని, డ్రోన్లను వినియోగిస్తున్నారని, అయితే ఇవి స్థానిక మహిళల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తున్నాయని ఆయన తన నివేదికలో చెప్పారు.
వంట చెరకు, పశువులకు గడ్డి సేకరించేందుకు మహిళలు అటవీ ప్రాంతాల్లోకి వెళ్లినప్పుడు తమ భావాలను హాయిగా వ్యక్తం చేస్తారని, మనసు విప్పి మాట్లాడుకుంటారని, పాటలు పాడతారని తెలిపారు. అయితే, కెమెరాల్లో ఇలాంటివి రికార్డు అయినప్పుడు అవి సోషల్ మీడియాకు ఎక్కుతున్నాయని, ఇది మహిళలపై వేధింపులకు కారణమవుతున్నదని చెప్పారు. ఇలాంటి పలు ఘటనలను తన నివేదికలో ఉదహరించారు. కెమెరా అంటేనే స్థానిక మహిళలు భయపడుతున్నట్టు చెప్పారు.