హైదరాబాద్, మార్చి 11: అర్జెంటీనాకు చెందిన సోఫీ మౌరీ అనే 25 ఏండ్ల యువతి తనను తానే పెండ్లి చేసుకున్నట్టు సోషల్ మీడియాలో ప్రకటించింది. ఇందుకు సంబంధించి పెండ్లి గౌను వేసుకున్న ఫొటోలను కూడా ఆమె షేర్ చేసింది. అయితే, పెండ్లి గురించి పోస్ట్ చేసిన తెల్లవారే తనకు తాను విడాకులు ఇవ్వాలనుకుంటున్నట్టు ఆమె మళ్లీ సోషల్ మీడియాలో ప్రకటించింది. దీంతో ఇప్పుడు ఆమె కథ వైరల్గా మారింది. కేవలం అందరి దృష్టిని ఆకర్షించడానికే ఆమె ఇలా చేస్తున్నదని కొందరు నెటిజన్లు సోఫీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, తనను తానే ఎందుకు పెండ్లి చేసుకుందో, ఎందుకు 24 గంటలు కూడా గడవకముందే విడాకులు ఇవ్వాలనుకుంటుందో కారణాలు మాత్రం ఆమె వెల్లడించలేదు.