బ్యాంగ్‌కాక్: థాయిలాండ్‌లో బౌద్ధ మతస్తులు ఎక్కువే. ఆ దేశంలో బౌద్ధ ఆచారాలను గౌరవిస్తారు. బౌద్ధ సన్యాసులు(Buddhist Monks) కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. బౌద్ధ ఆలయాలు కూడా ఎక్కువే. అయితే శృంగార జీవితానికి దూరంగా ఉండే ఆ సాధువులను ఓ మహిళ బ్లాక్మెయిల్ చేసింది. వలపువల వేసి శృంగారంలోకి దింపింది. ఆ తర్వాత ఫోటోలు, వీడియోలతో వాళ్లను బ్లాక్మెయిల్ చేసింది. బౌద్ధ సాధువులను మోసం చేసిన కేసులో ఓ మహిళను అరెస్టు చేశారు. సన్యాసం స్వీకరించిన వారిని టార్గెట్ చేస్తూ వారి నుంచి భారీ స్థాయిలో డబ్బులు వసూల్ చేసినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి.
ఇటీవల ఓ సీనియర్ బౌద్ధ సాధువు తన హోదా నుంచి తప్పుకున్నారు. దీంతో అధికారులు ఆ అంశంపై దృష్టి పెట్టారు. ఎందుకు ఆ సాధువు తన సన్యాసాన్ని వదిలేశాడో తెలుసుకోవాలని దర్యాప్తు చేపట్టారు. అయితే ఓ మహిళ వేధిస్తున్న విషయాన్ని వాళ్లు గ్రహించారు. తాను ప్రెగ్నెంట్ అని, తనకు డబ్బులు కావాలని ఓ మహిళ అతన్ని బెదిరించింది. ఆ సీనియర్ సాధువు ఆమెకు పలుమార్లు లక్షల్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాడు. అయితే ఆ కూపీ లాగిన పోలీసులకు మరో స్టన్నింగ్ విషయం తెలిసింది. చాలా మంది బౌద్ద సాధువులను ఆమె ఇలాగే మోసం చేసినట్లు తేల్చారు. సుమారు 9 మంది సీనియర్ బౌద్ద సన్యాసులు ఆమె ట్రాప్‌లో పడినట్లు గుర్తించారు. వారి నుంచి కనీసం ఆమె 12 మిలియన్ల డాలర్ల సొమ్ము రాబట్టినట్లు విచారణలో తేల్చారు.
ఆ మహిళ ఇంటికి వెళ్లిన పోలీసులకు మరో షాకింగ్ విషయం తెలిసింది. ఆమె ఇంట్లో సుమారు 80వేల ఫోటోలు, వీడియోలను గుర్తించారు. వాటితో ఆమె బౌద్ద మాంక్లను బ్లాక్మెయిల్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బౌద్ధ సన్యాసులు శృంగార కార్యకలాపాల్లో, డ్రగ్ ట్రాఫికింగ్‌లో ఎక్కువగా పాల్గొంటున్నట్లు ఇటీవల తెలిసింది. దీంతో థాయిలాండ్‌లో బౌద్ధ వ్యవస్థపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. శృంగార సంబంధం పెట్టుకున్న బౌద్ధ సాధువుల నుంచి డబ్బులు వసూల్ చేసిన ఆ మహిళ మొత్తం డబ్బును ఆన్లైన్ బెట్టింగ్‌లో పెట్టినట్లు పోలీసులు తేల్చారు.
బెదిరింపు వసూళ్లు, మనీ ల్యాండరింగ్ లాంటి కేసుల్ని ఆమెపై నమోదు చేశారు. తప్పుగా ప్రవర్తించే సాధువుల గురించి ఫిర్యాదు చేసేందుకు థాయ్‌లాండ్ ప్రభుత్వం ప్రత్యేక హాట్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. హద్దులు ఉల్లంఘిస్తున్న సాధువులను క్రమశిక్షణలో పెట్టేందుకు ప్రభుత్వం కొత్త తరహా పెనాల్టీలు, జైలుశిక్షలు వేసేందుకు సిద్ధమైంది. థాయ్‌లాండ్‌లో ఉన్న జనాభాలో 90 శాతం మంది బౌద్ధం అని చెప్పుకుంటారు.