న్యూయార్క్: భారత్‌లో రైతులు ఉద్యమం చేస్తున్న సమయంలో.. ట్విట్టర్‌పై ఆ దేశం ఆంక్షలు విధించినట్లు మాజీ సీఈవో జాక్ డార్సీ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆ ఆరోపణలపై ట్విట్టర్ సంస్థ ఓనర్ ఎలన్ మస్క్(Elon Musk) స్పందించారు. స్థానిక ప్రభుత్వ ఆదేశాలను తాము పాటిస్తామని మస్క్ అన్నారు. తమ వద్ద ఎటువంటి ఆప్షన్ లేదని, స్థానిక ప్రభుత్వ చట్టాలను గౌరవిస్తామని ఆయన అన్నారు. దేశం ఏదైనా.. స్థానిక చట్టాలను గౌరవిస్తూ వాటిని అనుసరించడమే శ్రేయస్కరం అని మస్క్ తెలిపారు. చట్టాలను వ్యతిరేకించడం సముచితం కాదన్నారు. వేర్వేరు ప్రభుత్వాలకు వేర్వరు నియమాలు, నియంత్రణలు ఉంటాయని, చట్టం ప్రకారం స్వేచ్ఛను అందించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తూ ఉంటామని మస్క్ అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోదీని కలిసిన తర్వాత మస్క్ ఈ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.