Pezeshkian : తమ అణు కార్యక్రమం గురించి అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ అధ్యక్షుడు (Iran President) మసౌద్ పెజెష్కియన్ (Masoud Pezeshkian) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇరాన్ హక్కులను కాలరాయడానికి నువ్వెవరు అని ట్రంప్‌ను సూటిగా ప్రశ్నించారు. ఇరాన్ తన అణు హక్కులను ఉపయోగించకూడదని ట్రంప్ అంటున్నారని, కానీ ఏ నేరం కింద ఈ మాట చెబుతున్నారో వెల్లడించడం లేదని ఎద్దేవా చేశారు. ఒక దేశం హక్కులను లాక్కోవడానికి ఆయన ఎవరు..? అని పెజెష్కియన్ నిలదీశారు.
ఈ వ్యాఖ్యలను ఆదివారం ఇరానియన్ స్టూడెంట్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించగా.. రాయిటర్స్ వార్తా సంస్థ ప్రచురించింది. ఇరాన్ తన అణు సాంకేతికతను వినియోగించుకోకుండా అడ్డుకునేందుకు వాషింగ్టన్కు ఎలాంటి చట్టపరమైన హక్కు లేదని పెజెష్కియాన్ స్పష్టంచేశారు. అమెరికా చర్యలు ఇరాన్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమేనని అన్నారు. కాగా తాత్కాలిక కాల్పుల విరమణ బుధవారంతో ముగియనున్న నేపథ్యంలో పెజెష్కియన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
తమ అణు హక్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోబోమని ఇరాన్ తేల్చిచెబుతోంది. మరోవైపు వాషింగ్టన్-టెహ్రాన్ మధ్య అణు ఒప్పందం సహా పలు అంశాలపై రేపు మరో దఫా చర్చలు జరగవచ్చని తెలుస్తోంది. అయితే ఈ చర్చలవల్ల పెద్దగా ఉపయోగం లేదని, ఇరు పక్షాల మధ్య ఇంకా చాలా అంతరాలు ఉన్నాయని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘేర్ ఘలీబాఫ్ శనివారం రాత్రి తెలిపారు.