వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజ్ఞప్తి మేరకు భారత దేశం రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించుకుందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ గురువారం చెప్పారు. చైనా కూడా అదే పని చేస్తున్నదన్నారు. తమ ఆంక్షలు అత్యంత భారీగా ఉన్నాయని చెప్పారు. చైనాకు సంబంధించిన వార్తలను తాను చూశానని, చైనా కూడా రష్యా నుంచి చమురు కొనుగోళ్లను తగ్గించుకుంటున్నట్లు తెలుస్తున్నదని చెప్పారు.
అమెరికా మిత్ర దేశాలైన యూరోపియన్ దేశాలను కూడా ట్రంప్ ఇదే విధంగా కోరారని తెలిపారు. అంతకుముందు ట్రంప్ మాట్లాడుతూ, రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ ఈ ఏడాది చివరికి సున్నా స్థాయికి తగ్గిస్తుందని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, భారత ప్రభుత్వం ఈ ప్రకటనలను ఖండించింది. దేశంలోని వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణకే పెద్ద పీట వేస్తామని స్పష్టం చేసింది.