ఢాకా: దేశవ్యాప్తంగా జరుగుతున్న తీవ్ర ఆందోళనల నేపథ్యంలో.. ఇవాళ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా.. తన పదవికి రాజీనామా చేసి.. దేశం విడిచి వెళ్లారు. అయితే ఆమె ఎక్కడికి వెళ్లారన్న దానిపై పూర్తి క్లారిటీలేదు. ప్రత్యేక మిలిటరీ విమానంలో షేక్ హసీనాతో పాటు ఆమె సోదరి షేక్ రెహానా.. ఇండియాకు పయనమైనట్లు కొన్ని వార్తా సంస్థలు పేర్కొంటున్నాయి.
పశ్చిమ బెంగాల్ దిశగా ఆమె వెళ్లినట్లు ఢాకా ట్రిబ్యూన్ తన రిపోర్టులో పేర్కొన్నది. కానీ బంగ్లాదేశ్ బీబీసీ మాత్రం ఆమె అగర్తలా వెళ్తున్నట్లు చెప్పింది. బంగభబన్ నుంచి ఆమె మధ్యాహ్నం 2.30 నిమిషాలకు బయలుదేరి వెళ్లారు. షేక్ హసీనా, షేక్ రెహానా.. చాలా సురక్షితమైన ప్రాంతానికి చేరుకున్నట్లు ఓ వార్తా సంస్థ తెలిపింది. అధ్యక్ష భవనం విడిచి వెళ్లడానికి ముందు.. షేక్ హసీనా స్పీచ్‌ను రికార్డు చేయాలనుకున్నారు.
కానీ సమయం లేకపోవడంతో ఆమె తొందరగా అక్కడ నుంచి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. 1971 యుద్ధంలో మరణించిన పోరాటయోధుల పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు 30 శాతం కోటాను కేటాయిస్తూ షేక్ హసీనా సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం జరిగిన హింసలో సుమారు వంద మంది మరణించారు.