ఉక్రెయిన్‌పై రష్యా తన దాడిని తీవ్రతరం చేసిన నేపథ్యంలో బ్రిటన్ స్పందించింది. ఉక్రెయిన్ ప్రజలకు తాము అండగా ఉంటామని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ హామీ ఇచ్చారు. ఉక్రెయిన్ ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని తాము ప్రార్థనలు చేస్తున్నామని, తాము ఉక్రెయిన్ వైపే ఉన్నామని హామీ ఇచ్చారు. మరోవైపు బ్రిటన్ను సురక్షితంగా ఉంచడానికి ఏదైనా చేస్తామని, బ్రిటన్ ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. పుతిన్ ఓ నియంత అని, ఉక్రెయిన్‌పై విరుచుకుపడటం ద్వారా రష్యా క్రూరత్వం ప్రపంచాలకు తెలిసిపోతోందని బ్రిటన్ ప్రధాని విరుచుకుపడ్డారు. తమతో సహా ఇతర దేశాలు రష్యాపై విధించిన ఆర్థిక ఆంక్షలను తాము అంగీకరిస్తామని, ఇక.. ఆయిల్ గ్యాస్ విషయంలో రష్యాపై ఆధారపడడం తగ్గించుకోవాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమీర్ జెలెన్స్కీ కీలక ప్రకటన చేశారు. దేశ రక్షణ కోసం తాము ఎవ్వరికైనా ఆయుధాలను ఇవ్వడానికి రెడీగానే ఉన్నామని కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌కు మద్దతివ్వడానికి సిద్ధంగా ఉండాలని ఆయన కోరారు. రష్యా మెరుపుదాడి చేసిందని, నాజీ జర్మనీ లాగా రష్యా దాడి చేసిందని జెలెన్స్కీ అభివర్ణించారు. రష్యా ఉక్రెయిన్‌పై దాడులకు దిగడంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమీర్ జెలెన్స్కీ ఉక్రెయిన్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.