US Student Visa | విదేశీ విద్యార్థులకు భారీ ఊరట.. ట్రంప్ సర్కారు ప్రతిపాదనను కొట్టివేసిన అమెరికా కోర్టు!
US Student Visa | అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే విదేశీ విద్యార్థులకు భారీ ఊరట లభించింది. అంతర్జాతీయ విద్యార్థులు, పరిశోధకులు, విదేశీ జర్నలిస్టుల నివాస గడువుకు పరిమితులు విధించాలని ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలను అక్కడి ఫెడరల్ కోర్టు కొట్టివేసింది.
US Student Visa | అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే విదేశీ విద్యార్థులకు భారీ ఊరట లభించింది. అంతర్జాతీయ విద్యార్థులు, పరిశోధకులు, విదేశీ జర్నలిస్టుల నివాస గడువుకు పరిమితులు విధించాలని ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలను అక్కడి ఫెడరల్ కోర్టు కొట్టివేసింది. విద్యార్థుల నివాస కాలపరిమితి నాలుగేళ్లకు పరిమితం చేయడంతోపాటు, ఆ తర్వాత కొనసాగాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేయాలన్న హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) ప్రతిపాదన చట్టవిరుద్ధమని తేల్చింది. దీంతో దశాబ్దాలుగా అమల్లో ఉన్న ‘డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్’ విధానం కొనసాగనుంది. ఈ తీర్పుతో అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు సహా విదేశీ విద్యార్థులకు ఊరట లభించినట్లయింది.
ట్రంప్ సర్కారు ప్రతిపాదన ఏమిటంటే?
విదేశీ విద్యార్థులు, పరిశోధకులు, జర్నలిస్టులు అమెరికాలో ఉండే కాలాన్ని నిర్దిష్ట గడువులకు పరిమితం చేయాలని DHS గత జులైలో కొత్త నిబంధనలను ప్రతిపాదించింది. ప్రస్తుతం ఎఫ్-1 విద్యార్థి వీసాపై అమెరికాకు వెళ్లేవారు తమ విద్యా కార్యక్రమం పూర్తయ్యే వరకు, వీసా నిబంధనలను పాటిస్తూ అక్కడ ఉండే అవకాశం ఉంది. దీన్నే ‘డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్’ విధానం అంటారు. అయితే ఈ విధానాన్ని తొలగించి, అంతర్జాతీయ విద్యార్థుల బసను గరిష్ఠంగా నాలుగేళ్లకు పరిమితం చేయాలని ప్రభుత్వం భావించింది. అంతకంటే ఎక్కువ సమయం అవసరమైతే DHS నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సి వచ్చేది.
ఈ ప్రతిపాదన ఎక్స్ఛేంజ్ విజిటర్లు, పరిశోధకులు, ప్రొఫెసర్లు, బోధకులకు వర్తించే జే-1 వీసాదారులతోపాటు విదేశీ మీడియా ప్రతినిధులనూ లక్ష్యంగా చేసుకుంది. విదేశీ జర్నలిస్టుల బసను 240 రోజులకు పరిమితం చేయాలని, చైనా జర్నలిస్టులకు ఈ గడువును 90 రోజులుగా నిర్ణయించాలని ప్రతిపాదించింది.
విద్యార్థులకు సంబంధించి కూడా పలు మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం యోచించింది. చదువు పూర్తయిన తర్వాత లేదా చదువు అనంతరం ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) ముగిసిన తర్వాత అమెరికాను విడిచిపెట్టేందుకు ప్రస్తుతం ఇస్తున్న 60 రోజుల గడువును 30 రోజులకు తగ్గించాలని ప్రతిపాదించింది. భాషా కోర్సులు అభ్యసించే విద్యార్థులకు సెలవులు, విరామ సమయాలతో కలిపి మొత్తం 24 నెలల బస పరిమితి విధించాలని సూచించింది. నాలుగేళ్లలో కోర్సు పూర్తి చేయలేని విద్యార్థులు అదనపు సమయం కోసం ప్రభుత్వ అనుమతి పొందాల్సి వచ్చేది.
ప్రభుత్వానికి విస్తృత అధికారాలు లేవు: ఫెడరల్ కోర్టు
ట్రంప్ సర్కార్ తీసుకొచ్చిన ఈ ప్రతిపాదనలను సవాలు చేస్తూ ఉన్నత విద్యా సంస్థలు, విద్యా సంఘాలు, కార్మిక సంఘాల కూటమి కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన మసాచుసెట్స్ జిల్లా ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి ఎఫ్. డెన్నిస్ సేలర్ నవంబర్ 16న తుది తీర్పు వెలువరించారు. DHS తీసుకొచ్చిన నిబంధనలు ఏకపక్షంగా ఉన్నాయని, చట్టానికి అనుగుణంగా లేవని పేర్కొంటూ వాటిని పూర్తిగా రద్దు చేశారు. విదేశీ విద్యార్థులకు అమెరికాలో విద్యా అవకాశాలు కల్పించాలన్నది కాంగ్రెస్ ఉద్దేశమని, ఆ అవకాశాలను అడ్డుకునేలా వ్యవహరించేందుకు DHSకు విస్తృత అధికారాలు లేవని న్యాయమూర్తి స్పష్టం చేశారు. వీసా వ్యవస్థలో మోసాలు, జాతీయ భద్రతకు సంబంధించిన ఆందోళనలను పరిష్కరించేందుకు తక్కువ భారంతో కూడిన ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించడంలోనూ ప్రభుత్వం విఫలమైందని కోర్టు అభిప్రాయపడింది. ఇప్పటికే ఉన్న పర్యవేక్షణ వ్యవస్థలను మెరుగుపరిచే అవకాశాన్ని కూడా DHS తగినంతగా పరిశీలించలేదని పేర్కొంది.
సెప్టెంబరులోనే తాత్కాలిక అడ్డుకట్ట
ఈ ప్రతిపాదిత నిబంధనల అమలును న్యాయమూర్తి సేలర్ గత సెప్టెంబరులోనే ప్రాథమిక ఉత్తర్వుల ద్వారా నిలిపివేశారు. పాత డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ విధానాన్ని తొలగించి, వీసాదారులకు నిర్దిష్ట కాలపరిమితులు విధించేలా DHS తీసుకున్న చర్యకు అడ్డుకట్ట వేశారు. ఈ ఉత్తర్వును సవాలు చేస్తూ హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఫస్ట్ సర్క్యూట్ అప్పీళ్ల కోర్టును ఆశ్రయించింది. నవంబర్ 3న తుది తీర్పు త్వరలో వెలువడే అవకాశం ఉన్నందున విచారణను 30 రోజుల పాటు వాయిదా వేయాలని కోరింది. తాజాగా ఫెడరల్ కోర్టు తుది తీర్పు వెలువరించడంతో ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన గడువు పరిమితులకు అడ్డుకట్ట పడింది. అయితే ప్రభుత్వం ఈ తుది తీర్పును కూడా ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేసే అవకాశం ఉంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US Student Visa | విదేశీ విద్యార్థులకు భారీ ఊరట.. ట్రంప్ సర్కారు ప్రతిపాదనను కొట్టివేసిన అమెరికా కోర్టు!
Sarpanch Elections: సర్పంచ్ ఎన్నికల్లో హింస.. పోల్ సిబ్బందిపై దాడి, మెజిస్ట్రేట్ కారు దగ్ధం
418 Movie | ఓటీటీలోకి ప్రశాంత్ నీల్ హారర్ థ్రిల్లర్ ‘418’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Robert Pattinson | కొత్త జేమ్స్ బాండ్‌గా రాబర్ట్ పాటిన్సన్.. అధికారికంగా ప్రకటించిన అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్
PM Modi: మనీలాలో గురుద్వార ఖల్సాను సందర్శించిన ప్రధాని మోదీ
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

