కాబూల్: తాను అమెరికా దళాల కళ్లగప్పి వారి ముందే తిరిగానని, వారిని ఫూల్స్ చేశానని తాలిబన్ అధికార ప్రతినిధి జబివుల్లా ముజాహిద్ తెలిపారు. ఎవరూ ఊహించని విధంగా, అత్యంత వేగంతో ఆఫ్ఘనిస్థాన్‌ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో తాలిబన్ అధికార ప్రతినిధి జబివుల్లా ముజాహిద్ పాకిస్థాన్ మీడియా సంస్థ ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్‌కు ప్రత్యేక ఇంటర్వూ ఇచ్చారు. అమెరికా, ఆఫ్ఘన్ దళాల ముక్కు కిందనే తాను చాలా ఏండ్లుగా కాబూల్‌లోనే ఉన్నానని అన్నారు. తన అసలు పేరు జబివుల్లా దీనికి సహకరించిందని తెలిపారు. ‘నేను చాలా కాలం కాబూల్‌లో నివసించాను. అందరి (అమెరికా, ఆఫ్ఘన్ దళాలు) ముక్కు కింద ఉన్నాను. దేశం నలువైపులా తిరిగాను. సరిహద్దులో సమాచారం తెలుసుకుని తాలిబన్లకు చేరవేశాను. దీంతో సులువుగా వారు ఆ ప్రాంతాలను ఆక్రమించారు. మా ప్రత్యర్థులకు ఇది చాలా అయోమయంగా ఉండేది’ అని ముజాహిద్ చెప్పారు.
తాను ఎప్పుడూ ఆఫ్ఘన్ నుంచి పారిపోలేదని, అమెరికా, ఆఫ్ఘన్ దళాల నుంచి చాలాసార్లు తప్పించుకున్నానని 43 ఏండ్ల తాలిబన్ నేత తెలిపారు. సెమినార్లకు హాజరయ్యేందుకు చాలా చోట్లకు, పాకిస్థాన్‌కు కూడా వెళ్లానని చెప్పారు. తన కోసం అమెరికా, ఆఫ్ఘన్ దళాలు నిరంతరం వేటాడినప్పటికీ దేశాన్ని విడిచి పోవాలని ఎప్పుడూ అనిపించలేదన్నారు. జబివుల్లా ముజాహిద్ కేవలం తాలిబన్లు సృష్టించిన పాత్ర అని, నిజమైన వ్యక్తి కాదని అమెరికా, ఆఫ్ఘన్ దళాలు నమ్మాయని, ఇదే తనను కాపాడిందని అన్నారు. అమెరికా దళాలు తన ఆచూకీ కోసం స్థానికులకు డబ్బులు ఇచ్చేవారని, అయినప్పటికీ ఎలాగోలా వారి కళ్లగప్పి తప్పించుకునేవాడినని చెప్పారు.
చాలా చిన్నప్పుడు సాధారణ స్కూల్లో చదివిన తాను, అనంతరం మదర్సాకు వెళ్లి మతపరమైన విద్య మార్గాన్ని అనుసరించానని తన చిన్ననాటి సంగతులను జబివుల్లా ముజాహిద్ గుర్తు చేసుకున్నారు. ఖైబర్-పఖ్తుంఖ్వాలోని నౌషెరాలో హక్కానీ శిక్షణ సంస్థలో కొంత కాలం ఉన్నట్లు తెలిపారు. 16 ఏండ్ల వయసులో తాలిబన్లో చేరిన తాను, వ్యవస్థాపకుడు ముల్లా ఉమర్‌ను ఎప్పుడూ చూడలేదన్నారు. తన అసలు పేరు జబివుల్లా అని, అయితే తెహ్రీక్లోని సీనియర్లు తనను ముజాహిద్ అని పిలిచేవారని అన్నారు. ఈ పేరు వల్లనే తన ఉనికి లేదని అమెరికా, ఆఫ్ఘన్ దళాలు భావించేవని, ఇదే తనను వారి నుంచి కాపాడిందంటూ అసలు రహస్యాన్ని ఆయన వెల్లడించారు.