వాషింగ్టన్: బిడ్డ గాలిలో ఎగిరిపోవడాన్ని చూసి తల్లి షాక్ అయ్యింది. కేకలు వేస్తూ బిడ్డను పట్టుకునేందుకు కంగారుగా పరుగెత్తింది. అయితే తన భర్త చేసిన చిలిపి చేష్టగా గ్రహించి రిలీఫ్ అయ్యింది. అమెరికాకు చెందిన ‘మాక్ అండ్ బెకీ కామెడీ’ ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఇంటి పనుల్లో బిజీగా ఉన్న ఒక మహిళ, గ్యాస్ బెలూన్లు చుట్టి ఉన్న చిట్టి పాప ఒక్కసారిగా ఎగిరిపోవడాన్ని చూసి కంగారు పడింది. పట్టుకోమని భర్తకు చెబుతూ పాప ఉన్న చోటకు వచ్చింది. ఇంతలో ఆమె భర్త పాపను పట్టుకుని ముందుకు వచ్చాడు. దీంతో ఆ మహిళ ఊరట చెందింది.
కాగా, భర్త ఎమెర్సన్ తన భార్యను ప్రాంక్ చేసేందుకు ఇలా చేసినట్లు తెలుస్తున్నది. గ్యాస్ బూరలు చుట్టి పాపను పట్టుకున్న ఆయన గాలిలో ఎగురుతున్నట్లుగా పాపను మెల్లగా పైకి ఎత్తాడు. అయితే పాప నిజంగా గాల్లో ఎగిరిపోతున్నదని భావించిన ఆ మహిళ కంగారు పడింది.
మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. నెటిజన్లు దీనిపై పలు రకాలుగా స్పందించారు. వీడియోను పలు మార్లు చూసిన తర్వాత గాని ఫ్రాంక్ వీడియోగా గ్రహించలేకపోయినట్లు పలువురు తెలిపారు. పాప నిజంగా గాల్లో ఎగురలేదని, అలా భ్రమించేలా తండ్రి మెల్లగా ఆమెను ఎత్తాడన్న సంగతిని గ్రహించి కొందరు ఆశ్చర్యపోయారు. అయితే ఆ చిన్నారి ఎంతో సంతోషించి ఉంటుందని ఒకరు వ్యాఖ్యానించారు. మరోవైపు పసి పాపతో తండ్రి చేసిన ఫ్రాంక్పై కొందరు మండిపడ్డారు.