ఢాకా: వందలాది మంది ప్రయాణిస్తున్న బోటును ఒక పెద్ద నౌక ఢీకొట్టి ముంచేసింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో మరణించగా పెద్ద సంఖ్యలో గల్లంతయ్యారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సమీపంలోని శీతలక్ష్య నదిలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. కార్గో షిప్ ఎంవీ రూపోషి-9, ఫెర్రీ బోటు ఎంవీ అఫ్సరుద్దీన్ను సమీపించి తొక్కేసింది. దీంతో అంతా చూస్తుండగా వందలాది ప్రయాణికులన్న ఆ బోటు మునిగిపోయింది. అందులోని కొందరు నదిలో దూకేశారు. సుమారు పది మందికిపైగా మరణించగా, పలువురు గల్లంతయ్యారు.
కాగా, ఐదు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు బంగ్లాదేశ్ పోలీసులు తెలిపారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు, ఒక చిన్నారి ఉన్నట్లు చెప్పారు. మరో 22 మంది ఈదుకుని క్షేమంగా నది ఒడ్డుకు చేరినట్లు వివరించారు. ప్రమాద సమయంలో ఆ బోటులో 60 మందికిపైగా ప్రయాణించినట్లు అధికారులు వెల్లడించారు.
మరోవైపు మరో బోటులో ప్రయాణిస్తున్న కొందరు తమ మొబైల్ ఫోన్లో దీనిని రికార్డు చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. పెద్ద ఓడ కింద నలిగిపోయిన బోటులోని ప్రయాణికుల దయనీయ స్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రమాదాల సమయంలో ఎలా తప్పించుకోవచ్చో అన్నది కొందరు వివరించారు.