Violence @ China | చైనాలోని కొవిడ్ టెస్ట్ కిట్ ఫ్యాక్టరీలో హింస తలెత్తింది. పోలీసులు-ఆందోళనాకారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నది. పోలీసుల తీరును నిరసిస్తూ అక్కడే ఉన్న మందుల పెట్టెలను పోలీసులపైకి విసిరేశారు. ఒకేసారి వందల సంఖ్యలో నిరసనకారులు ప్రదర్శనగా రావడంతో పోలీసులు నిశ్చేష్టులై ఉండిపోయారు. ఈ ఘటన చాంగ్కింగ్ సెంట్రల్ మున్సిపాలిటీలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారింది.
చాంగ్ కింగ్ సెంట్రల్ మున్సిపాలిటీలో ఉన్న ఇండస్ట్రియల్ పార్క్లో పోలీసులు-నిరసనకారుల మధ్య ఘర్షణ తలెత్తింది. కొవిడ్ టెస్ట్ కిట్ ఫ్యాక్టరీని ముట్టడించిన పెద్ద సంఖ్యలో ఉద్యోగులను బయటకు పంపే క్రమంలో పోలీసులతో నిరసనకారులు వాగ్వాదానికి దిగారు. పలువురు పోలీసులపైకి అక్కడే ఉన్న మందుల పెట్టెలు, చెత్త కుండీలను విసిరేశారు. చాంగ్ కింగ్ సెంట్రల్ మున్సిపాలిటీ పరిధిలోని పారిశ్రామిక పార్కులో ఉన్న జేబియో సంస్థ కొవిడ్ టెస్ట్ కిట్లను తయారుచేస్తున్నది. అయితే, వేతనాలు పెంచడంతో పాటు విధుల నుంచి తొలగించిన వారిని తిరిగి తీసుకోవాలంటూ గత కొన్నిరోజులుగా ఆ సంస్థ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు.
我靠 重庆那边人这么猛? pic.twitter.com/kWbOZzutaP
— QINGEN XU 徐勤根 (@QingenXu) January 7, 2023
జీరో కొవిడ్ విధానాన్ని చైనా ప్రభుత్వం అమల్లోకి తేవడంతో పలు కొవిడ్ సంబంధ ఉత్పత్తులు చేసే ఫ్యాక్టరీలు వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించాయి. దాంతో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు నిరుద్యోగులుగా మారారు. నిన్నటి వరకు తమతో 24 గంటలు పనిచేయించుకున్న ఫ్యాక్టరీ.. జీరో కొవిడ్ విధానం అమల్లోకి రావడంతోనే తమను వీధుల్లోకి విసిరేయడం భావ్యం కాదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు చెల్లించాల్సిన జీతం తక్షణమే చెల్లించాలని, ఉద్యోగాలు కల్పించాలని ఆందోళనాకారులు డిమాండ్ చేస్తున్నారు.