రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్ని వ్యవహారాలను సెట్ చేసే.. ఉక్రెయిన్‌పై దాడులకు దిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అటు దాడులు చేయడానికి తగిన ప్రదేశాలను ఎంచుకోవడం, దాడులు చేసే విషయంలో వ్యూహం.. ఏయే ప్రాంతాలను ఎలా స్వాధీన పరుచుకోవాలి? ఇలా… అన్ని విషయాలపై ఓ స్పష్టత వచ్చిన తర్వాతే దాడులకు సిద్ధమైనట్లు కొందరు పేర్కొంటున్నారు. ప్రస్తుత పరిణామాలను చూస్తే ఇది సరైనదేనని అనిపిస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తు.. ఉక్రెయిన్‌లో నాయకత్వ మార్పు వ్యవహారంలో కూడా పుతిన్ ఓ స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు ఓ రిపోర్టు పేర్కొంటోంది. ఉక్రెయిన్ను స్వాధీనం చేసుకొని, తదుపరి అధ్యక్షుడు ఎవరన్నది కూడా పుతిన్ ముందే నిర్ణయించారన్నది ఆ నివేదిక సారాంశం.
ఉక్రెయిన్ ప్రస్తుత అధ్యక్షుడు జెలెన్స్కీ. ఈయన తర్వాత విక్టర్ యనుకోవిచ్‌ను ఉక్రెయిన్ తదుపరి అధ్యక్షుడిగా పుతిన్ నియమిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈయన గతంలో ఉక్రెయిన్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2014 లో రష్యాకు వలస వచ్చారు. ఈయనను తిరిగి ఉక్రెయిన్ అధ్యక్ష పీఠంపై పుతిన్ కూర్చోబెడతారని ఉక్రయిన్స్కా ప్రావ్దా తన కథనంలో పేర్కొంది. విక్టర్ యనుకోవిచ్‌ను తిరిగి ఉక్రెయిన్ పీఠంపై కూర్చోబెట్టడానికి పుతిన్ అన్ని ఏర్పాట్లు చేశారని తెలుస్తోంది.
విక్టర్ యనుకోవిచ్ ఎవరంటే…
విక్టర్ యనుకోవిచ్ బేసిన్ అనే ప్రాంతంలో ఓ నిరుపేద కుటుంబంలో జన్మించారు. యవ్వనంలో రెండు సార్లు జైలు జీవితం కూడా గడిపారు. 20 ఏళ్ల ప్రాయంలో కొన్ని రోజుల పాటు మెకానిక్‌గా కూడా పనిచేశారు. ఆ తర్వాత ఓ పెద్ద కంపెనీలో పనిచేసి, ఉన్నత స్థాయికి ఎదిగారు. మెకానికల్ ఇంజినీరింగ్‌లో పట్టాను పొందారు. ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీలో చేరి, నాయకుడిగా ఎదిగారు. 2002 లో అప్పటి ఉక్రెయిన్ అధ్యక్షుడు లియోనిద్ కుచ్మా విక్టర్ యనుకోవిచ్‌ను ఉక్రెయిన్ ప్రధానిగా నియమించారు. ప్రధాని పీఠం ఎక్కేవరకూ ఆయనకు ఉక్రెయిన్ భాషే తెలియదంటే నమ్మగలమా?
ఇక 2004 లో ఉక్రెయిన్‌లో ఎన్నికలు వచ్చాయి. కుచ్మా తదుపరి వారసుడు విక్టర్ యనుకోవిచ్ మాత్రమే అవుతారు అన్నంతలా ఎదిగిపోయారు. పుతిన్ కూడా ఈయనకు అప్పట్లో మద్దతిచ్చారు. ఆ తర్వాత ఎన్నికల సమయంలో ఈయన ప్రత్యర్థి యనుకోవిచ్పై దాడి చేశారు. ఆ తర్వాత యనుకోవిచ్ గెలుపొందారు. అయితే కోర్టు తీర్పు ఈయనకు వ్యతిరేకంగా వచ్చింది. ఆ తర్వాత 2010 లో ఉక్రెయిన్ అధ్యక్షుడయ్యారు. అధ్యక్షుడు కావడమే ఆలస్యం రష్యాపై తనకున్న స్వామి భక్తిని నిరూపించుకున్నారు. అలా 2014 వరకూ అధ్యక్షుడిగా కొనసాగారు. తదనంతర కాలంలో విక్టర్ యనుకోవిచ్పై అవినీతి ఆరోపణలు భారీ స్థాయిలో వచ్చాయి. దీంతో ఆయన పదవి వదిలి రష్యా పారిపోయారు.