కారకాస్: వెనిజువెలా అధ్యక్ష ఎన్నికల్లో నికోలస్ మదురో మళ్లీ గెలుపొందారు. కొన్నేండ్లుగా తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఆయన అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందటంపై ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేశాయి. ఎన్నికల్లో నికోలస్ మదురోకు 51శాతం ఓట్లు, ప్రధాన ప్రతిపక్ష అభ్యర్థి ఎడుముందో గోంజలేజ్కు 44శాతం ఓట్లు వచ్చాయని ‘నేషనల్ ఎలక్టోరల్ కౌన్సెల్’ ప్రకటించింది. కాగా, ఎన్నికల ఫలితాల్ని ప్రధాన ప్రతిపక్షాలు తిరస్కరించాయి. మదురో అనుయాయులు, విధేయుల నియంత్రణలో ఉన్న ఎన్నికల బూత్ నుంచి మాత్రమే ఫలితాలు తీసుకున్నారని, 30 శాతం బ్యాలెట్ బాక్సుల డాటాతో ఆయన గెలుపును నిర్ధారించారని ప్రతిపక్షాలు ఆరోపించాయి.