న్యూయార్క్ : అమెరికాలో విశృంఖలమైన గన్ కల్చర్‌ను కట్టడి చేస్తూ చారిత్రాత్మక గన్ కంట్రోల్ చట్టంపై అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్ శనివారం సంతకాలు చేశారు. టెక్సాస్ ఎలిమెంటరీ స్కూల్లో ఇటీవల ఇద్దరు టీచర్లు సహా 19 మంది విద్యార్ధుల ఊచకోత సహా మూకుమ్మడి కాల్చివేతల ఘటనలు పెచ్చుమీరిన నేపథ్యంలో ఈ చట్టంపై బైడెన్ సంతకం చేశారు.
ఈ సందర్భంగా వైట్‌హౌస్‌లో బైడెన్ మాట్లాడుతూ చారిత్రక చట్టంతో విలువైన ప్రాణాలను కాపాడతామని చెప్పారు. కాల్పుల ఘటనలో బాధిత కుటుంబాలను అధ్యక్షుడు ప్రస్తావిస్తూ అరాచకాలను ఆపేందుకు ఏదో ఒకటి చేయాలనే బాధితులు మనకు పంపిన సందేశం ఇప్పుడు నెరవేరిందని అన్నారు.
ఈరోజు ఆ దిశగా మనం కీలక అడుగులు వేశామని బైడెన్ పేర్కొన్నారు. ఇక ఈ బిల్లును గురువారం సెనేట్ ఆమోదించగా శుక్రవారం సభ తుది ఆమోదం లభించింది. యూరప్‌లో రెండు సదస్సుల్లో పాల్గొనేందుకు బైడెన్ బయలుదేరి వెళ్లేందుకు ముందు చారిత్రక చట్టంపై సంతకాలు చేశారు. ఈ చట్టం ప్రకారం గన్లను కొనుగోలు చేసే అత్యంత పిన్న వయస్కులకు బ్యాక్‌గ్రౌండ్ చెక్‌ను కఠినతరం చేయడం వంటి పలు చర్యలను పొందుపరిచారు.