వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు వింత అనుభవం ఎదురయ్యింది. ఎయిర్ ఫోర్స్ వన్ విమానం మెట్లు ఎక్కుతూ జారిపడ్డారు. ఇలా మూడుసార్లు పడిపోయారు. అయితే రెయిలింగ్‌ను పట్టుకుని లేచి విమానంలోకి ఎక్కేశారు. గత కొన్ని రోజులుగా అమెరికాలో ఆసియా వాసులపై వరుసగా కాల్పులు జరుగుతున్నాయి. దీంతో ఆసియన్-అమెరికన్ కమ్యూనిటీ సభ్యులను కలవడానికి బైడెన్ వాషింగ్టన్ నుంచి అట్లాంటా పయనమయ్యారు.
ఈ క్రమంలో 78 ఏండ్ల బైడెన్ ఎయిర్‌పోర్స్ వన్ విమానం మెట్లు ఎక్కుతూ పట్టుతప్పి పడిపోయారు. తన కుడిచేత్తో రెయిలింగ్ పట్టుకుని లేచి రెండు మెట్లు ఎక్కగానే మళ్లీ జారిపోయారు. తనంత తానుగా లేస్తుండగా.. ఎడమకాలు జారడంతో మరోమారు పడిపోయారు. అనంతరం లేచి ఎడమ కాలును దులుపుకుని మొత్తానికి పైకి చేరుకున్నారు. అందరికి అభివాదం చేస్తూ విమానం లోపలికి వెళ్లిపోయారు. కాగా, ప్రస్తుతం అధ్యక్షుడు బాగానే ఉన్నారని అధికారులు ప్రకటించారు.
మౌనంతో సమస్య జఠిలం
విద్వేషానికి వ్యతిరేకంగా గళం వినిపించాలని బైడెన్ పిలుపునిచ్చారు. మన మౌనం సమస్యను మరింత జఠిలం చేస్తుందని ఆయన అన్నారు. మూడు రోజుల క్రితం అట్లాంటాలో ఆసియా అమెరికన్లపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ దాడిలో 8 మంది మృతిచెందారు. దాంట్లో ఆరుగరు ఆసియా మహిళలే ఉన్నారు. ఈ నేపథ్యంలో జార్జియాలో పర్యటించిన బైడెన్.. ఆసియా అమెరికన్ నేతలను కలిశారు. కోవిడ్ మహమ్మారి వేళ ఈస్ట్ ఏషియా దేశాల వారిపై విద్వేష దాడులు పెరిగాయని, వర్ణవివక్ష మన దేశాన్ని చాన్నాళ్లుగా పీడిస్తోందని, ఆ మంటల్ని ఆర్పేందుకు అమెరికన్లు ప్రయత్నించాలని బైడెన్ అన్నారు. కరోనా మహమ్మారికి ఆసియన్లే కారణమన్న ఉద్దేశంతో శ్వేతజాతీయులు.. ఆసియా అమెరికన్లపై దాడులు చేస్తున్నారు. గత ఏడాది నుంచి అమెరికాలో సుమారు మూడు వేలకు పైగా దాడులు జరిగాయి. విద్వేషం అమెరికాను సురక్షితంగా ఉంచదని, దాన్ని ఆపాలని బైడెన్ అన్నారు. అందరం కలిసి దాన్ని అడ్డుకోవాలన్నారు.
US President Joe Biden just fell 3 times in a row trying to go up the stairs to Air Force One @CalebJHull pic.twitter.com/RDzRnbErBG
— حسن سجواني 🇦🇪 Hassan Sajwani (@HSajwanization) March 19, 2021