ట్రంప్‌కు ‘మధ్యంతర’ పరీక్ష!
అమెరికాలో నవంబర్ 3న జరగనున్న మధ్యంతర ఎన్నికలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో విడత పాలనకు కీలక పరీక్షగా మారాయి. కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభ, సెనేట్‌పై ఆధిపత్యం కోసం అధికార రిపబ్లికన్ పార్టీ, ప్రతిపక్ష డెమోక్రాట్లు పోటీపడుతున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు ట్రంప్ ప్రభుత్వ విధానాల అమలు, బడ్జెట్ కేటాయింపులు, ఉన్నతాధికారుల నియామకాలు, ప్రభుత్వంపై కాంగ్రెస్ పర్యవేక్షణ వంటి అంశాలపై ప్రభావం చూపనున్నాయి.
- యూఎస్‌లో నేడే కీలక ఎన్నికలు
- రిపబ్లికన్లు, డెమోక్రాట్ల మధ్య హోరాహోరీ పోరు
- కాంగ్రెస్‌పై పట్టు దక్కేదెవరికో?
- అధ్యక్షుడి మిగిలిన రెండేండ్ల పాలనపై ఫలితాల ప్రభావం
వాషింగ్టన్, నవంబర్ 2: అమెరికాలో నవంబర్ 3న జరగనున్న మధ్యంతర ఎన్నికలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో విడత పాలనకు కీలక పరీక్షగా మారాయి. కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభ, సెనేట్‌పై ఆధిపత్యం కోసం అధికార రిపబ్లికన్ పార్టీ, ప్రతిపక్ష డెమోక్రాట్లు పోటీపడుతున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు ట్రంప్ ప్రభుత్వ విధానాల అమలు, బడ్జెట్ కేటాయింపులు, ఉన్నతాధికారుల నియామకాలు, ప్రభుత్వంపై కాంగ్రెస్ పర్యవేక్షణ వంటి అంశాలపై ప్రభావం చూపనున్నాయి. డెమోక్రాట్లు కనీసం ఒక సభలో మెజారిటీ సాధిస్తే, ట్రంప్ తన ప్రతిపాదనలను ముందుకు తీసుకెళ్లడంలో మరిన్ని అడ్డంకులు ఎదుర్కొనే అవకాశం ఉన్నది.
కాంగ్రెస్‌లో ఆధిపత్యమే కీలకం
అమెరికా కాంగ్రెస్‌లో దిగువ సభ అయిన ప్రతినిధుల సభలో మొత్తం 435 స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం వీటన్నింటికీ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రతినిధుల సభలో ప్రస్తుతం రిపబ్లికన్లకు 218, డెమోక్రాట్లకు 214 స్థానాలున్నాయి. ప్రతినిధుల సభలో మెజారిటీ సాధించాలంటే డెమోక్రాట్లు కనీసం నాలుగు స్థానాలను నికరంగా గెలుచుకోవలసి ఉంటుంది. సెనేట్‌లో 100 స్థానాలుండగా, ఈసారి 35 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. సెనేట్‌లో రిపబ్లికన్లకు 53, డెమోక్రాట్లకు, వారికి మద్దతుగా నిలిచే స్వతంత్ర సభ్యులతో కలిపి 47 మంది సభ్యులున్నారు. సెనేట్‌లోనూ ప్రస్తుత ఆధిక్యాన్ని తారుమారు చేయాలంటే డెమోక్రాట్లు నాలుగు స్థానాలు అదనంగా సాధించాలి. ప్రతినిధుల సభపై డెమోక్రాట్లకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సర్వేలు సూచిస్తుండగా, సెనేట్‌లో పోటీ ఉత్కంఠభరితంగా ఉంది.
డెమోక్రాట్లు గెలిస్తే ట్రంప్‌కు అడ్డంకులు
ప్రతినిధుల సభలో మెజారిటీ సాధించిన పార్టీకి సభ నాయకత్వంతోపాటు కీలక కమిటీలపై నియంత్రణ లభిస్తుంది. డెమోక్రాట్లు ఈ సభను గెలుచుకుంటే ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాలపై విచారణలు చేపట్టవచ్చు. ప్రభుత్వ అధికారులను ప్రశ్నించేందుకు, పత్రాలను కోరేందుకు, సాక్షులను విచారణకు పిలిచేందుకు అవకాశం ఉంటుంది. బడ్జెట్, ప్రభుత్వ వ్యయం, పన్నుల విధానం వంటి అంశాల్లోనూ ట్రంప్ ప్రతిపాదనలకు ప్రతిపక్షం నుంచి గట్టి సవాళ్లు ఎదురవ్వవచ్చు.
అయితే, డెమోక్రాట్లు ప్రవేశపెట్టే బిల్లులు చట్టాలుగా మారాలంటే సెనేట్ ఆమోదం, అధ్యక్షుడి సంతకం వంటి ప్రక్రియలు అవసరం. ట్రంప్‌కు వీటో అధికారం కూడా ఉంటుంది. ఒకవేళ సెనేట్‌లోనూ డెమోక్రాట్లు ఆధిపత్యం సాధిస్తే, అధ్యక్షుడు ప్రతిపాదించే ఉన్నతాధికారులు, ఫెడరల్ న్యాయమూర్తుల నియామకాల ఆమోదాన్ని ఆలస్యం చేయడం లేదా అడ్డుకోవడం ద్వారా ప్రభావం చూపగలరు. అయితే, అధ్యక్షుడిని పదవి నుంచి తొలగించే అధికారం మధ్యంతర ఎన్నికలకు లేదు. అధ్యక్షుడిని పదవి నుంచి తొలగించాలంటే సెనేట్‌లో మూడింట రెండొంతుల మెజారిటీతో దోషిగా నిర్ధారించాలి.
ధరల పెరుగుదల.. వలస విధానాలపై చర్చ
ఈ ఎన్నికల్లో అమెరికా ప్రజలను వేధిస్తున్న జీవన వ్యయం ప్రధాన అంశంగా మారింది. ఆహార పదార్థాలు, ఇండ్లు, వైద్య సేవల ఖర్చులు పెరగడం ఓటర్ల నిర్ణయాలను ప్రభావితం చేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అధ్యక్షుడి పార్టీ ఆర్థిక వ్యవస్థను ఎలా నిర్వహిస్తున్నదన్న అంశంపై ప్రజలు తమ అసంతృప్తిని మధ్యంతర ఎన్నికల్లో వ్యక్తం చేయడం సాధారణం. వలస విధానాలు, సరిహద్దుల భద్రత, ఉద్యోగాలు, వేతనాల పెరుగుదల, దిగుమతి సుంకాలు కూడా ప్రచారంలో కీలకంగా ఉన్నాయి. రిపబ్లికన్లు అక్రమ వలసలను అరికట్టడం, సరిహద్దుల భద్రతను బలోపేతం చేయడంపై దృష్టిపెడుతుండగా, డెమోక్రాట్లు జీవన వ్యయం, ఆరోగ్య సంరక్షణ, ట్రంప్ సుంకాల విధానాల ప్రభావాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు.
అధికార పార్టీకి మధ్యంతర ఎన్నికల్లో ఎదురుదెబ్బలు ఎందుకు?
అమెరికా రాజకీయ చరిత్రలో అధ్యక్షుడి పార్టీ మధ్యంతర ఎన్నికల్లో స్థానాలు కోల్పోవడం తరచుగా కనిపిస్తుంది. 1938 నుంచి 2022 వరకు జరిగిన 22 మధ్యంతర ఎన్నికల్లో 20 సార్లు అధ్యక్షుడి పార్టీ ప్రతినిధుల సభలో స్థానాలు కోల్పోయినట్టు గణాంకాలు సూచిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం అధికారంలో ఉన్న పార్టీ పనితీరుపై ఓటర్లు అసంతృప్తిని వ్యక్తం చేయడం.
భారత్‌పైనా ప్రభావం ఉండొచ్చు!
అమెరికా ఎన్నికల ఫలితాలు భారత్‌తో వాణిజ్య సంబంధాలు, సుంకాలు, వలస విధానాలు, హెచ్1బీ వీసాలు, రక్షణ సహకారం వంటి అంశాలపై చర్చలను ప్రభావితం చేయవచ్చు. కాంగ్రెస్‌లో అధికార సమీకరణాలు మారితే ఈ అంశాలపై విచారణలు, చట్టసభ చర్చలు పెరిగే అవకాశం ఉంది. డెమోక్రాట్లు గెలిచినంత మాత్రాన ప్రభుత్వం అమలు చేస్తున్న వీసా నిబంధనలు లేదా సుంకాలు వెంటనే రద్దవుతాయని చెప్పలేం. కాంగ్రెస్ మార్పులు ప్రధానంగా ప్రభుత్వంపై పర్యవేక్షణ, బడ్జెట్ చర్చలు, చట్టాల రూపకల్పనలో ప్రభావం చూపుతాయి.
2028 అధ్యక్ష ఎన్నికలకు ముందస్తు సంకేతం
మధ్యంతర ఎన్నికలు కాంగ్రెస్‌లో ఎవరి ఆధిపత్యం ఉంటుందన్న అంశానికే పరిమితం కావు. 2028 అధ్యక్ష ఎన్నికలకు ముందు అమెరికా ఓటర్ల ప్రాధాన్యాలు, ట్రంప్ పాలనపై ప్రజాభిప్రాయం ఎలా ఉందన్న దానికీ ఇవి సంకేతాలివ్వనున్నాయి. రిపబ్లికన్లు రెండు సభల్లోనూ ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటే ట్రంప్ తన విధానాలను కొనసాగించేందుకు మరింత వెసులుబాటు లభిస్తుంది. డెమోక్రాట్లు ఒకటి లేదా రెండు సభల్లో మెజారిటీ సాధిస్తే ప్రభుత్వంపై పర్యవేక్షణ పెరిగి, కీలక బిల్లుల ఆమోదం కష్టతరం కావొచ్చు.
బరిలో 57 మంది భారత సంతతి అభ్యర్థులు

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారత సంతతికి చెందిన పలువురు అభ్యర్థులు కీలక పదవుల కోసం పోటీపడుతున్నారు. కాంగ్రెస్ సభ్యులుగా కొనసాగేందుకు కొందరు ప్రయత్నిస్తుండగా, మరికొందరు గవర్నర్, అటార్నీ జనరల్, రాష్ట్ర చట్టసభలు, స్థానిక ప్రభుత్వాల్లో పదవులను ఆశిస్తున్నారు. మొత్తం 22 రాష్ర్టాల్లో కనీసం 57 మంది భారత సంతతి అభ్యర్థులు బరిలో ఉన్నట్టు ఐఏఎన్ఎస్ నివేదికను ఉటంకిస్తూ అవుట్‌లుక్ వెల్లడించింది. వీరిలో ఒకరు సెనేట్‌కు, 11 మంది ప్రతినిధుల సభకు, ముగ్గురు రాష్ట్రస్థాయి పదవులకు, 36 మంది రాష్ట్ర చట్టసభలకు, ఆరుగురు స్థానిక పదవులకు పోటీ చేస్తున్నారు.
ఈ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న వారిలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి వివేక్ రామస్వామి ఒకరు. 2024లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీచేసి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ ఆయనకు మద్దతు ప్రకటించారు. ప్రస్తుతం అమెరికా ప్రతినిధుల సభలో సభ్యులుగా ఉన్న నలుగురు భారత సంతతి డెమోక్రటిక్ నాయకులు మరోసారి ఎన్నిక కావాలని ప్రయత్నిస్తున్నారు. వారు రో ఖన్నా, ప్రమీలా జయపాల్, అమీ బెరా, సుహాస్ సుబ్రహ్మణ్యం. న్యూయార్క్ అటార్నీ జనరల్ పదవికి తెలంగాణ మూలాలున్న సరితా కోమటిరెడ్డి పోటీచేస్తున్నారు. లాస్ ఏంజెలెస్ మేయర్ బరిలో నిత్య రామన్ ఉన్నారు. మరో హైదరాబాదీ అరుణా మిల్లర్ కూడా మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా మరోసారి ఎన్నిక కావాలని భావిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

