Alex Wong | అమెరికాకు చెందిన ఓ వ్యక్తి ఓ హిందీ పాటకు క్లాసికల్ డ్యాన్స్‌తో (Classical Dance) అదరగొట్టాడు. అద్భుతమైన డ్యాన్స్‌తోపాటు తన హావ భావాలతో నెటిజన్ల హృదయాలను కొల్లగొట్టాడు. అలెక్స్ వాంగ్ (Alex Wong) అనే అమెరికన్ బాలీవుడ్ సూపర్ హిట్ ‘సాథియా’లోని ‘చల్కా చల్కా రే’ పాటకు అద్భుతంగా డ్యాన్స్ వేశాడు. ముఖంలో చిరునవ్వులు చిందిస్తూ తన డ్యాన్స్‌కు భరతనాట్యాన్ని జోడించాడు. ఈ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశాడు.
‘నేను భారతీయ నృత్యం నేర్చుకోవాలనుంటున్నా. ఆ తరగతుల కోసం వెతకడం ప్రారంభించా. ఇది నా మొదటి భరతనాట్య ఫ్యూజన్ క్లాస్. ఇది ఒక కొత్త భాషను నేర్చుకోవడం లానే ఉంది. చేతులు, పాదాలను సమన్వయం చేస్తూ డ్యాన్స్ చేయడం కష్టంగా అనిపించింది.’ అంటూ దానికి క్యాప్షన్ జోడించాడు. అతని డ్యాన్సుకు నెటిజన్లు మంత్రముగ్ధులయ్యారు. స్వల్ప వ్యవధిలోనే ఆ వీడియోను వేలాది మంది చూశారు. అతని హావభావాలు ఆకట్టుకోవడంతో ప్రశంసలు కురిపిస్తున్నారు.కాగా, బాలీవుడ్లో అత్యంత ప్రాచుర్యం పొందిన ‘చల్కా చల్కా రే ’ పాట సాథియా సినిమాలో ఉన్నది. వివేక్ బోబెరాయ్, రాణీ ముకర్జీ జంటగా నటించిన ఈ సినిమా 2002లో విడుదలయింది. ఈ పాటను ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ స్వరపరచగా.. రిచా శర్మ, మహాలక్ష్మి, వైశాలి, షోమ ఆలపించారు.