న్యూయార్క్, సెప్టెంబర్ 6: బటన్ కెమెరా.. చేతి గడియారంలో రికార్డర్.. హ్యాండ్‌బ్యాగ్‌లో కెమెరా.. స్టింగ్ ఆపరేషన్ అంటే చాలు వెంటనే మన కళ్ల ముందు ఇవే మెదులుతాయి. సినిమాల్లోనూ వీటినే ఎక్కువగా చూపిస్తారు. ఫొటో తీసే షర్ట్, వీడియో తీసే ప్యాంట్, మన లోకేషన్ పంపించే సాక్సులు, గూఢచారిలా పని చేసే అండర్వేర్ (లో దుస్తులు) గురించి ఎప్పుడైనా విన్నారా? గూఢచారులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖ వ్యక్తుల కోసం అమెరికా రక్షణ శాఖ ఈ తరహా దుస్తులను అభివృద్ధి చేస్తున్నది. స్మార్ట్ ఈ-ప్యాంట్స్ ప్రోగ్రామ్‌లో భాగంగా యాక్టివ్ స్మార్ట్ టెక్స్టైల్స్ (ఏఎస్టీ) దుస్తులను అమెరికా తయారు చేస్తున్నది. దీని కోసం ఏకంగా 22 మిలియన్ డాలర్లను (దాదాపు రూ.182 కోట్లు)వెచ్చిస్తున్నది. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎస్ఆర్ఐ ఇంటర్నేషనల్, అరెటె సంస్థల సహకారంతో రూపొందిస్తున్న ఈ దుస్తులు సాధారణ వస్ర్తాల మాదిరిగానే కనిపిస్తాయి. కెమెరా, రికార్డర్ తరహా ఎలక్ట్రానిక్ పరికరాలు వస్ర్తాల లోపల భాగాల్లో ఉండటం వల్ల ఎవరూ వాటిని గుర్తించలేరని ప్రోగ్రామ్ మేనేజర్ డా.డావ్సన్ కాగ్లే తెలిపారు.