వాషింగ్టన్ : ఇరాన్ యుద్ధ ప్రతిష్టంభన కొనసాగుతున్నప్పటికీ, హొర్ముజ్ జలసంధి గుండా రోజుకు లక్షలాది బ్యారెళ్ల చమురును రవాణా చేసేందుకు అమెరికా సైన్యం రహస్యంగా ఒక షిప్పింగ్ కారిడార్‌ను ఏర్పాటు చేసిందని ఇద్దరు అమెరికా అధికారులను ఉటంకిస్తూ ‘ఆక్సియోస్’ తెలిపింది. హొర్ముజ్ జలసంధి తెరిచే ఉందని, ఈ కీలకమైన మార్గంపై అమెరికాకు పూర్తి నియంత్రణ ఉందని పేర్కొంటూ, ఇరాన్‌తో చేసుకున్న 60 రోజుల స్వల్పకాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించడాన్ని ట్రంప్ తోసిపుచ్చిన కొద్ది రోజులకే ఈ పరిణామం చోటుచేసుకుంది.
ఒమన్ తీరంలో దక్షిణ చానల్ ద్వారా ప్రతి రాత్రి 15 నుంచి 20 ట్యాంకర్లు ఈ జలసంధిలోకి ప్రవేశిస్తూ, బయటకు వెళుతూ.. ఈ ఆపరేషన్ గత కొన్ని వారాలుగా కొనసాగుతున్నది. అధికారుల సమాచారం ప్రకారం ప్రస్తుతం ప్రతిరోజూ సుమారు 10 మిలియన్ బ్యారెళ్ల చమురు గల్ఫ్ నుంచి ప్రపంచ మార్కెట్లకు రవాణా అవుతున్నది.