న్యూయార్క్: అమెరికా ఆరోగ్యశాఖ మంత్రిగా రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్(Robert F Kennedy Jr)ను ఎన్నికైన అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నియమించారు. ఆరోగ్యశాఖ బాధ్యతలను ఆర్ఎఫ్కే జూనియర్‌కు అప్పగించడం పట్ల వివాదం చెలరేగుతున్నది. డెమోక్రటిక్ పార్టీకి మద్దతు ఇచ్చే కుటుంబం నుంచి వచ్చిన ఆయనకు.. రిపబ్లికన్ల సెగ తగిలే అవకాశాలు ఉన్నాయి. కోవిడ్ సమయంలో టీకాలను ఆర్ఎఫ్కే వ్యతిరేకించారు. దీంతో పాటు ఆయనపై అనేక కేసుల్లో అభియోగాలు ఉన్నాయి. అనేక వివాదాల్లోనూ ఆర్ఎఫ్‌కేకు పాత్ర ఉన్నది.
ఆరోగ్యశాఖ మంత్రిగా రాబర్ట్ కెన్నడీ.. ఆహార భద్రతతో పాటు వైద్య పరిశోధన, సంక్షేమ కార్యక్రమాలను చూసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ శాఖను పర్యవేక్షించేందుకు రాబర్ట్ కెన్నడీ ఎంత వరకు అర్హుడు అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వ్యాక్సిన్ల వల్లే ఆటిజం వస్తుందని ఆయన గతంలో పేర్కొన్నారు. జాతీయ ప్రజా ఆరోగ్య ఏజెన్సీ, సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) లాంటి సంస్థలను ఇక ఆర్ఎఫ్కేనే చూసుకోవాల్సి ఉంటుంది.