Mariupol | గత మూడు వారాలుగా ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడుతూనే ఉంది. బాంబులు, మిస్సైళ్లతో దాడులు చేస్తూ చిన్న దేశాన్ని అతలాకుతలం చేస్తున్నది. ఒకవైపు చర్చలకు రమ్మని పిలుస్తూనే.. తాము అన్నదే సాగాలంటూ మొండిపట్టు పడుతుంది. చెప్పింది వినట్లేదని మళ్లీ దాడులకు పాల్పడుతూనే ఉంది. ఈ క్రమంలో రాజధాని కీవ్ నగరంతో పాటు మరో రెండు నగరాలపై ఎక్కువగా విధ్వంసం సృష్టిస్తున్నది. ఇందులో ముఖ్యంగా వినిపిస్తున్న నగరం పేరు మరియుపోల్. ఇక్కడి ప్రాంతాలు, ఫ్యాక్టరీలపై రష్యా బలగాలు నిర్విరామంగా దాడులు చేస్తూనే ఉన్నాయి.. ఎలాగైనా ఈ నగరాన్ని స్వాధీనం చేసుకోవాలని రష్యాసేనలు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి. ఆ నగరాన్ని నలుదిశలా చుట్టుముట్టి ప్రతి పది నిమిషాలకు ఒక బాంబు దాడి చేస్తున్నది. మరోవైపు ఉక్రెయిన్ కూడా ఈ నగరంపై పట్టు కోల్పోకూడదని నిరంతరం పోరాడుతూనే ఉంది. ఇంతలా ఆ నగరం కోసం రెండు నగరాలు పట్టుబడుతున్నాయి. రెండు దేశాలకు ఆ నగరం ఎందుకు కీలకంగా మారింది?
నిజానికి మరియుపోల్ చాలా చిన్న నగరం. నల్ల సముద్రంలో భాగమైన అజోవ్ సముద్రతీరంలో ఇది ఉన్నది. కానీ ఇప్పుడు ఇది రష్యాకు చాలా కీలకంగా మారింది. ఎందుకంటే.. ఉక్రెయిన్‌లోని దోన్బస్‌లో వేర్పాటువాదుల ప్రాబల్యం అధికంగా ఉంది. వారికి రష్యా మద్దతు ఇస్తుంది. దీంతో ఉక్రెయిన్ వేర్పాటువాదులతో రష్యా జతకట్టాలని చూస్తుంది. ఇదిలా ఉంటే 2014లో క్రిమియాను రష్యా స్వాధీనం చేసుకుంది. దీంతో క్రిమియా నుంచి ఈశాన్యం వైపు దోన్బస్ వరకు ఉన్న భూభాగం తమ ఆధీనంలో ఉంచుకోవాలని రష్యా భావిస్తుంది. ఈ క్రమంలో ఈ రెండింటి మధ్య ఉన్న మరియుపోల్ నగరాన్ని స్వాధీనం చేసుకోవడం రష్యాకు చాలా అవసరంగా మారింది.
ఉక్రెయిన్ సైన్యానికి మద్దతుగా పనిచేసే పౌర సైన్యం అజోవ్ బ్రిగేడ్ మరియుపోల్‌లోనే ఉంది. ఇందులో ఎక్కువగా నియో, నాజీలు ఉన్నారు. కాబట్టి నియో నాజీలను ఎదురించి మరియుపోల్ నగరాన్ని స్వాధీనం చేసుకుంటే రష్యాకు కలిసొస్తుంది. నియో నాజీలను అంతమొందించడం కోసమే యుద్ధానికి దిగినట్లు స్వదేశంలో ప్రచారం చేసుకోవచ్చు. పైగా నల్ల సముద్ర తీర ప్రాంతాలు అన్నీ నోవోరసియా ( 18వ శతాబ్దం నాటి రష్యన్ భూభాగం )కే చెందుతాయని పుతిన్ అభిప్రాయం. కాబట్టి మరియుపోల్‌ను ఆక్రమించుకున్న తర్వాత ఇదే అంశాన్ని మళ్లీ తెరపైకి తీసుకురావాలని పుతిన్ అనుకుంటున్నారు.
ఉక్రెయిన్ దేశానికి కూడా మరియుపోల్ చాలా కీలకం. అజోవ్ సముద్ర తీరంలో ఉన్న అతి పెద్ద, ముఖ్యమైన ఓడరేవు ఇదే. ఉక్రెయిన్ నుంచి ప్రపంచ దేశాలకు ఎగుమతులు చాలావరకు ఇక్కడి నుంచే జరుగుతాయి. అందుకే ఒకవైపు రష్యా ఆధీనంలోని క్రిమియా, మరోవైపు దోన్బస్ వేర్పాటువాదుల మధ్య నలిగిపోయినప్పటికీ మరియుపోల్‌ను మాత్రం ఉక్రెయిన్ చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తుంది. ఒకవేళ ఈ నగరాన్ని కోల్పోతే ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బే అవుతుంది. అందుకే ఉక్రెయిన్ కూడా ఈ నగరం కోసం అంతలా పోరాడుతున్నది. మరియుపోల్‌ను స్వాధీనం చేసుకుంటే ఉక్రెయిన్ సముద్ర తీరాన్ని దాదాపు 80 శాతం కంటే ఎక్కువగా రష్యా చేతుల్లోకి వెళ్లిపోయినట్లే. అప్పుడు ఉక్రెయిన్ వాణిజ్యం భారీగా దెబ్బతింటుంది. అందుకే గత మూడు వారాలుగా రష్యా సైన్యంతో పోరాడుతూ ఆ నగరాన్ని ఉక్రెయిన్ రక్షించుకుంటుంది. దీంతో ఎలాగైనా మరియుపోల్ నగరాన్ని స్వాధీనం చేసుకోవాలని రష్యా దాడుల తీవ్రతను పెంచేసింది. ఆ నగరాన్ని నలుమూలల చుట్టేసింది.
మరియుపోల్‌పై ప్రతి పది నిమిషాలకు ఒక బాంబు పడుతుంది. యుద్ధ వాహనాలతో రష్యా బలగాలు దాడులు చేస్తున్నాయని ఉక్రెయిన్‌కు చెందిన నేషనల్ గార్డ్ అజోవ్ రెజిమెంట్‌కు చెందిన కెప్టెన్ స్వతోస్లవ్ పలమార్ తెలిపారు. అయినప్పటికీ తాము తగ్గేదేలేదని.. ప్రాణాలు ఉన్నంతవరకు రష్యాతో పోరాడి ఈ నగరాన్ని రక్షించుకుంటామని పేర్కొన్నారు. కానీ రష్యా మాత్రం మెల్లమెల్లగా మరియుపోల్ నగరాన్ని ఆధీనంలోకి తీసుకుంటూ ముందుకెళ్తుంది. ఈ నగరాన్ని కోల్పోవడం ద్వారా ఉక్రెయిన్‌కు ఆర్థిక, సైనికపరంగానే కాకుండా అంతకుమించి నష్టం వాటిల్లుతుంది. ముఖ్యంగా ప్రాణాలకు తెగించి రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్‌వాసులపై మానసికంగా ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుంది.
– నవీన్ కుమార్ రెడ్డి