Terrorist Attack | తుర్కియే రాజధాని అంకారాలో ఉగ్రదాడి జరిగింది. ఉగ్రవాదుల దాడిలో ముగ్గురు మృతి చెందగా.. 14 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అంకారాలోని తుర్కియే ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ కంపెనీ టుసాస్ ఆవరణలో ఈ ఉగ్రదాడి జరిగింది. అయితే, దాడికి తామే కారణమని ఇప్పటి వరకు ఏ ఉగ్ర సంస్థ ప్రకటించలేదు. తుర్కియే ఇంటీరియర్ మినిస్టర్ ‘ఎక్స్’ పోస్టులో టర్కిష్ ఏరో స్పేస్, డిఫెన్స్ కంపెనీ ఆవరణలో దాడి జరిగిందని పేర్కొన్నారు.
టర్కిష్ శివారులో ఉన్న ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ అంకారా కహ్రమంకజన్ ఫెసిలిటీపై తీవ్రవాద దాడి జరిగిందని అలీ యెర్లికాయ తెలిపారు. అయితే, ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించలేదు. టర్కిష్ వాణిజ్య మంత్రి ప్రొఫెసర్ డాక్టర్ ఉమర్ బోలాట్ సోషల్ మీడియా పోస్ట్‌లో తుర్కియే ఏరో స్పేస్ ఇండస్ట్రీ ఇంక్ ఫెసిలిటీ లక్ష్యంగా జరిగిన ఉగ్రదాడిని ఖండించారు. ఉగ్రవాదుల దాడిలో ప్రజలు అమరులవడం బాధ కలిగించిందన్నారు. తూటాలకు గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాన్నారు.
అంకారా శివారులో ఉన్న ఏరో స్పేస్ కంపెనీలోకి కొందరు సాయుధులు చొరబడ్డారని.. భద్రతా సిబ్బంది విధులు మారుతున్న సమయంలో దుండగులు లోపలికి ప్రవేశించినట్లుగా స్థానిక మీడియా తెలిపింది. ప్రవేశ మార్గం వద్దే ఓ వ్యక్తి బాంబును పేల్చగా.. మిగతా ఉగ్రవాదులంతా లోపలికి ప్రవేశించినట్లు చెప్పింది. ప్రస్తుతం కాల్పులు జరుగుతున్నాయని.. మరికొందరిని బందీలుగా చేసుకున్నట్లు పేర్కొంది. ఆ తర్వాత భద్రతా బలగాలు రంగంలోకి దిగి ఆపరేషన్ చేపట్టినట్లు వివరించింది. ఉగ్రదాడికి సంబంధించి ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.