న్యూఢిల్లీ, ఏప్రిల్ 9 : హొర్ముజ్ జలసంధిని దక్కించుకోవడానికి సాయం అందచేసేందుకు రానున్న కొన్ని రోజుల్లో స్పష్టమైన హామీలతో ముందుకు రావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రూటేకు అల్టిమేటం జారీచేశారు. ఇరాన్‌పై అమెరికా సాగిస్తున్న యుద్ధంలో తమ గగనతలాన్ని కాని వైమానిక స్థావరాలను కాని అమెరికా సైన్యానికి ఇవ్వకూడదని నాటో దేశాలు నిర్ణయించుకున్న నేపథ్యంలో ట్రంప్ కొత్త డిమాండును తెరమీదకు తెచ్చారు. హొర్ముజ్ జలసంధి గుండా నౌకాయానం సాగించేందుకు ఎలా సహకరిస్తారో తెలియచేస్తూ సమగ్ర ప్రణాళికలు తమకు అందచేయాలని యూరోపియన్ భాగస్వాములకు అమెరికా తాజాగా స్పష్టం చేసింది.
నాటో సెక్రటరీ జనరల్‌తో సమావేశంతోపాటు వైట్‌హౌస్, పెంటగాన్, విదేశాంగ శాఖలో జరిగిన ఉన్నత స్థాయి చర్చల సందర్భంగా ఈ డిమాండ్ తెరమీదకు వచ్చింది. ఈ సందర్భంగా నాటోపై ట్రంప్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘మనల్ని నిరాశపరిచే నాటో కూటమి సహా మిత్ర దేశాలపై ఒత్తిడి పెట్టకుంటే సమస్యలేవీ అర్థం కావు’ అని ట్రూత్ సోషల్‌లో ఆయన పోస్ట్ చేశారు. హొర్ముజ్కు యుద్ధ నౌకలు పంపాలని, లేదంటే నాటోకు అమెరికా మద్దతు ఉపసంహరించుకుంటుందని అంతకుముందు ట్రంప్ హెచ్చరించారు.