న్యూయార్క్: సముద్రంలో పీడనం ఎలా ఉంటుందో తెలుసా? ఆ వత్తిడిని తట్టుకోవడం ఎలాగో తెలియకుంటే ఇక మన పని అంతే. టైటానిక్ శిథిలాలను చూసేందుకు వెళ్లిన టైటాన్ సబ్(Titan submersible) .. తీవ్ర పీడనం వల్ల పేలినట్లు అంచనా వేస్తున్నారు. ఆ ప్రమాదంలో అయిదుగురు మృతిచెందారు. అయితే సముద్ర గర్భంలోకి వెళ్తున్న కొద్దీ.. వత్తిడి అధికం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. మన మీద ఎంత నీరు ఉంటే, అది మనల్ని అంత లోతుల్లోకి నెట్టివేస్తుంది. బహుశా ఆ పీడనం వల్లే టైటాన్ సబ్ మునిగి పేలి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
నిజానికి టైటాన్ సబ్ ఎందుకు పేలిందన్న దానిపై క్లారిటీ లేదు. అయితే ఆ సబ్‌కు ఉన్న ఔటర్ గేట్లో ఏదో స్వల్ప మార్పు జరిగి ఉంటుందని, దాని వల్ల ఆ ప్రమాదం జరిగే ఛాన్సు ఉంటుందని కొందరు నిపుణులు భావిస్తున్నారు. సముద్రంలో ఉండే ప్రెజర్ ను వన్ అట్మాస్పియర్గా కొలుస్తారు. అంటే దాదాపు ఒక స్క్వేర్ ఇంచుపై దాదాపు 6.6 కేజీల బరువుతో కూడిన వత్తిడి ఉంటుంది. అయితే నీటిలోకి వెళ్తున్న కొద్దీ.. ప్రతి 10 మీటర్లకు ఒకసారి ఆ పీడనం మరింతగా పెరుగుతుంది.
తాజా సమాచారం ప్రకారం 3000 మీటర్ల కింద టైటాన్ సబ్ పేలి ఉంటుందని అనుమానిస్తున్నారు. అంటే అక్కడ ఉపరితలం మీద ఉన్న వత్తిడి కన్నా 300 రెట్లు అధికంగా పీడనం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆ వత్తిడే సబ్‌ను జలసమాధి చేసినట్లు భావిస్తున్నారు.
టైటానిక్ నౌక శిథిలాలు ఉన్న ప్రాంతాన్ని మిడ్నైట్ జోన్‌గా పిలుస్తున్నారు. అధికారికంగా దీన్ని బాథీపెలాజిక్ జోన్ అంటారు. అంటే ఇది 3300 ఫీట్ల నుంచి 13,100 ఫీట్ల లోతులో ఈ ప్రాంతం ఉంటుంది. ఇక్కడ ఉష్ణోగ్రతలు 39 ఫారెన్‌హీట్ లేదా నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్ అన్నమాట. సముద్ర మట్టంతో పోలిస్తే ఇక్కడ ప్రెజర్ దాదాపు 100 రెట్లు అధికంగా ఉంటుంది. ఆ ప్రాంతంలో అధిక పీడనం ఉండడం వల్ల అక్కడ జీవించే జలచరాలు కూడా తక్కువే. చీకటిని, చలిని తట్టుకుని ఆ జంతువులు జీవించాల్సి ఉంటుంది. అలాంటి జలచరాలను ఒకసారి బయటకు తీసుకువస్తే అవి వెంటనే ప్రాణాలు విడుస్తాయి.
టైటాన్ సబ్ పేలిన శబ్ధాన్ని ఆదివారమే అమెరికా కోస్టు గార్డులు విన్నట్లు తెలుస్తోంది. అమెరికా నౌకల్లో ఉన్న సోనార్లు ఆ ధ్వనులను గుర్తించాయి. కానీ అనుమానంతో ఆ సబ్ కోసం వెతుకులాట సాగించారు. టైటాన్ సబ్ సముద్రంలోకి డైవ్ చేసిన గంటా 45 నిమిషాల తర్వాత దానితో కమ్యూనికేషన్ తెగిపోయింది. యూఎస్ కోస్టు గార్డులు మాత్రం ప్రమాదం జరిగి సమయాన్ని తేల్చలేకపోతున్నారు.
మినీసబ్ ప్రమాదంలో మరణించిన బాధితుల్లో హమీష్ హార్డింగ్, షహజాద్ దావూద్, సులేమాన్ దావూద్, పౌల్ హెన్రీ నర్గియోలెట్, స్టాక్టన్ రష్ ఉన్నారు.