ప్రపంచవ్యాప్తంగా బీచ్‌లలో ప్రతిరోజూ మిలియన్ల కొద్దీ కొత్త వస్తువులు, జంతువులు కనిపిస్తుంటాయి. ఇందులో కొన్ని మాత్రం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. ముఖ్యంగా అరుదైన సముద్ర జాతులు ఎప్పుడూ వింతగా కనిపిస్తుంటాయి. యూకేలోని వేల్స్ బెన్నార్ బీచ్‌లో ఇటీవల కనిపించిన వింత జీవి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇది ఏలియన్‌ను పోలి ఉండడంతో ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ వింతజీవిని షెల్ లాంగ్‌మోర్ అనే మహిళ గుర్తించారు. ఆ జీవి పేరేంటో తెలియకపోవడంతో దాన్ని ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటో ఆన్లైన్లో చక్కర్లు కొట్టింది. ఈ జీవిని కొంతమంది నిపుణులు గుర్తించగలిగారు. దీని పేరు గూస్ బార్నాకిల్స్ లేదా గూస్నెక్ బార్నాకిల్స్ అంటారని పేర్కొన్నారు. ఇవి అరుదైనవేకాక రుచికరమైనవని తెలిపారు.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సీ ఫుడ్స్‌లో ఇది ఒకటని వారు వెల్లడించారు. పోర్చుగల్, స్పెయిన్‌లో వీటిని ఎక్కువగా తింటారని తెలిపారు. వీటిధర కిలోకు రూ. 28వేల వరకు ఉంటుందని వెల్లడించారు. వీటిని స్పెయిన్‌లోని కోస్టా డా మోర్టేలో నీటి అడుగున రాళ్లు, పగుళ్ల నుంచి సేకరిస్తారని, నిపుణులైన మత్స్యకారులు తమ ప్రాణాలకు తెగించి వీటిని పట్టుకొస్తారని చెప్పారు. అందుకే వీటి ధర ఎక్కువ మొత్తంలో ఉంటుందని వివరించారు.