వాషింగ్టన్, అక్టోబర్ 1: ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు వాషింగ్టన్లో వేడుకగా సాగుతున్నాయి. ఆదివారం నాటి కార్యక్రమాల్లో వివిధ దేశాల నృత్య కళాకారుల ప్రదర్శనలు అబ్బురపర్చాయి. ఇక్కడి నేషనల్ మాల్లో శ్రీశ్రీ రవిశంకర్ ఆధ్వర్యంలో విశ్వమానవ హృదయ స్పందన కార్యక్రమం ఘనంగా జరిగింది. 180 దేశాలకు చెందిన ప్రజలు ఉక్రెయిన్లో శాంతిస్థాపన కోసం ప్రార్థించారు. ఆయా దేశాల జాతీయ జెండాల మధ్య 180 దేశాల సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్యగాన రీతులు వీక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి.
భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, మారిషస్ అధ్యక్షుడు పృథ్విరాజ్ సింగ్ రూపున్, జపాన్ దివంగత ప్రధాని షింజో అబే సతీమణి అకీ అబే, అమెరికాలో ప్రముఖ సర్జన్ డాక్టర్ వివేక్మూర్తి.. తదితరులు రెండో రోజు కార్యక్రమంలో ప్రసంగించారు. రామ్నాథ్ కోవింద్ మాట్లాడుతూ, ప్రపంచ ప్రజా వాహిని అంతా ఇక్కడ సమావేశమైందన్నారు.
రెండో రోజు ఆదివారం ప్రముఖ భారతీయ అమెరికన్ గాయకుడు, గ్రామీ అవార్డు గ్రహీత ఫాలు షా నేతృత్వంలో 10 వేలమందితో గార్బా నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ఐర్లాండ్ కళాకారుల స్టెప్ డ్యాన్స్, అఫ్గానిస్థాన్ కళాకారుల గీతాలాపన, వెయ్యిమంది చైనీస్-అమెరికన్ గాయకులు, కళాకారుల నృత్య ప్రదర్శన అందర్నీ అబ్బురపర్చింది. తొలి రోజున జరిగిన కార్యక్రమాలను దాదాపు 10 లక్షలమంది ప్రత్యక్షంగా వీక్షించినట్టు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రకటించింది.