కాబూల్: అప్ఘానిస్థాన్లో మహిళలు, మైనర్ బాలికల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. అక్కడి తాలిబన్ ప్రభుత్వం బాల్య వివాహాలను గుర్తిస్తూ వివాదాస్పద చట్టాన్ని తీసుకొచ్చింది. వివాహం, విడాకులు, బాల్య వివాహాలకు సంబంధించి నూతన కుటుంబ చట్టాన్ని ఆమోదించింది. దీని ప్రకారం, వివాహం విషయంలో టీనేజ్ యువతి(మైనర్) మౌనాన్ని సమ్మతిగా పరిగణిస్తారు. బాల్య వివాహాల విషయంలో తండ్రి, తాత అధికార పరిధిని విస్తరించారు.
ఇదే చట్టం.. బాలుడి విషయంలో మరోలా పేర్కొన్నది. వివాహం కుదిర్చే పెద్దలు అతడి సమ్మతి తీసుకోవటం తప్పనిసరి చేసింది. ఈ చట్టంపై హక్కుల సంఘాలు, అంతర్జాతీయ పరిశీలకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ తన బాల్య వివాహాన్ని యువతి రద్దు చేసుకోవాలంటే తాలిబన్ కోర్టు నుంచి సమ్మతి తీసుకోవాల్సి ఉంటుంది.