న్యూయార్క్: ఉక్రెయిన్పై సాగిస్తున్న యుద్ధంలో రష్యాకు సైనికపరంగా పెను నష్టమే మిగిలినట్లు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. వ్యూహాత్మకంగా తప్పిదానికి రష్యా పాల్పడినట్లు అంచనా వేశారు. యుద్ధం మొదలైన ఏడు రోజుల్లోనే రష్యా దళాలకు ఆహారం, ఇంధన కొరతలు ఏర్పడినట్లు అమెరికా ఇంటెలిజెన్స్ తెలిపింది. కొన్ని చోట్ల వాళ్లు ఆయుధ వాహనాలను వదిలివెళ్లారని, విమానాలు చాలా కూలిపోయాయని, వేలాది సంఖ్యలో రష్యా బలగాలు ప్రాణాలు కోల్పోయినట్లు యూఎస్ నిపుణులు చెప్పారు. రష్యా మిలిటరీ ఆశ్చర్యకర రీతిలో మిస్మేనేజ్మెంట్ చేసినట్లు అమెరికా స్పెషలిస్టులు తెలిపారు. రష్యా యుద్ధ విమానాలకు కూడా ఉక్రెయిన్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోందని డిఫెన్స్ నిపుణులు చెప్పారు. రెండు లేదా మూడు వారాల పాటు యుద్ధం అంటే అది మిలిటరీపరంగా తీవ్ర నష్టమే అని, రష్యా తన యుద్ధ వ్యూహా రచనలో విఫలమైనట్లు రక్షణదళ నిపుణుడు స్కాట్ బోస్టన్ తెలిపారు.