న్యూయార్క్, జూన్ 2: అంతరిక్షంలో భూమిలాగే జలాన్ని కలిగి ఉన్న గ్రహాలకోసం అన్వేషిస్తున్న పరిశోధకుల ప్రయత్నాలు ఫలించాయి. మన సౌర వ్యవస్థ ఆవల ఉన్న ఓ గ్రహంపై నీటి ఆనవాళ్లను తాజాగా గుర్తించారు. ‘డబ్ల్యూఏఎస్పీ-18బీ’ అనే గ్రహానికి సంబంధించి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ పంపించిన చిత్రాలను విశ్లేషించారు. ఆ గ్రహంపై నీటి ఆవిరి ఉనికిని గుర్తించారు.
‘డబ్ల్యూఏఎస్పీ-18బీ’ గ్రహాన్ని పరిశోధకులు 2009లో గుర్తించారు. ఇది భూమినుంచి దాదాపు 400 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఇది గురుగ్రహంకంటే 10 రెట్లు బరువైనది. తన నక్షత్రం చుట్టూ కేవలం 23 గంటల్లోనే చుట్టిరావడం ఈ గ్రహం ప్రత్యేకత. అంటే మన భూమితో పోల్చినప్పుడు ఈ గ్రహంపై 23 గంటల్లోనే ఒక ఏడాది పూర్తవుతుంది.