భూమిపై ఎన్ని ఖండాలున్నాయి? ఏడు. అవేంటి? ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా. రాబోయే కాలంలో ఓ కొత్త ఖండం ఏర్పడబోతున్నది. దాని పేరు ‘అమేసియా’. ఏదైనా ఖండం నుంచి కొన్ని దేశాలు విడిపోయి వేరే ఖండంగా ఏర్పడుతున్నాయా.. ఏంటి? అని అనుకోవద్దు. వేరే ఖండమే కొత్తగా ఏర్పడనున్నది. ఐతే ఇదంతా ఇప్పుడు కాదులెండి. 20 కోట్ల సంవత్సరాల తర్వాతే. ఆ సమయానికి ఒక మహాసముద్రమే భూమ్మీద లేకుండా పోతుందట.
పెర్త్, అక్టోబర్ 8: ఓ 30-40 కోట్ల సంవత్సరాల కిందట ప్రస్తుతం మనకు తెలిసిన ఖండాలు ఏర్పడ్డాయి. అంతకుముందు అంతా ఒకటే ఖండం ఉండేది. దాన్ని పాంజియా అనేవారు. దాని చుట్టూ ఒకే మహా సముద్రం ఉండేది. ఆ తర్వాత భూమి ఏడు ఖండాలుగా విడిపోయింది. మహాసముద్రం.. 5 సముద్రాలుగా మారింది. మళ్లీ కొత్త ఖండాలు ఎప్పుడు ఏర్పడతాయి? అనేదానిపై పరిశోధకులు తాజా పరిశోధనలు చేపట్టారు. ఇంకో కొత్త ఖండం మరో 20 కోట్ల సంవత్సరాల్లో ఏర్పడుతుందని ‘సూపర్ కంప్యూటర్’ ద్వారా వారు అంచనాకు వచ్చారు. ఆస్ట్రేలియాకు చెందిన న్యూ కర్టిన్ యూనివర్సిటీ, చైనాకు చెందిన పెర్కింగ్ వర్సిటీ శాస్త్రవేత్తలు కలిసి ఈ పరిశోధన సాగించారు. పసిఫిక్ మహా సముద్రం ఏటికేడు కొన్ని సెంటీమీటర్ల మేర అడుగంటిపోతున్నది. దీని పర్యవసానం ఎలా ఉంటుందని శాస్త్రవేత్తలు పరిశోధన చేపట్టగా, ఆ మహాసముద్రం మొత్తం అడుగంటిపోయి, ఒక కొత్త ఖండం ఏర్పడుతుందని తేలింది. ఈ తంతు పూర్తి కావటానికి దాదాపు 20-30 కోట్ల ఏండ్లు పడుతుందని తెలిసింది. సముద్ర భూగర్భంలో టెక్టోనిక్ ప్లేట్ల సామర్థ్యం తగ్గిపోతున్నదని, కదలికల్లో మార్పు వస్తున్నదని శాస్త్రవేత్తలు గుర్తించారు.
పసిఫిక్ ఎందుకు అడుగంటిపోతున్నది?
భూమ్మీద ఉన్న మహాసముద్రాల్లో అతిపెద్దది.. పసిఫిక్. అయితే, ఈ మహాసముద్రం తీరం చుట్టూ 24వేల మైళ్ల పొడవున సబ్డక్షన్ జోన్లు (టెక్టోనిక్ ప్లేట్ల కదలిక) ఉన్నాయి. వాటిని రింగ్ ఆఫ్ ఫైర్స్ అంటారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఏర్పడే 75 శాతం అగ్నిపర్వత విస్ఫోటాలు, 95 శాతం భూకంపాలు పసిఫిక్లోనే వస్తాయి. ఫలితంగా పసిఫిక్ కేంద్ర బిందువులో భూభాగం ఎత్తు ఏటా 3-6 అంగుళాలు వ్యాపిస్తున్నది.
ఖండం ఎలా ఏర్పడుతుందంటే..
‘ఆసియా తూర్పువైపునకు అంటే.. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా వైపునకు జరుగుతూ పోతుంది. ఈ ఖండాల మధ్య ఉన్న పసిఫిక్ మహాసముద్రం ఉండనే ఉండదు. అంటార్కిటికా.. దక్షిణ అమెరికావైపు కదులుతుంది. ఆసియా ఖండానికి మరోవైపు ఆఫ్రికా వచ్చి చేరుతుంది. ఆస్ట్రేలియా కూడా జత కలుస్తుంది. ఇంకోవైపు నుంచి యూరప్ వచ్చి కలిసి.. అమేసియా ఖండం ఏర్పడుతుంది’ అని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ ఖండాలన్నీ కలిసి ఒక ఖండంగా కలిసే అవకాశం ఉందన్నమాట.