Artificial Heart | న్యూయార్క్: గుండె విఫలమయ్యే ముప్పు ఎదుర్కొంటున్న వారి ప్రాణాలను కాపాడే కృత్రిమ గుండెను అమెరికాకు చెందిన బైవాకోర్ కంపెనీ తయారు చేసింది. బైవెంట్రిక్యులర్, యూని వెంట్రిక్యూలర్ హార్ట్ ఫెయిల్యూర్ ముప్పు ఉన్న వారి గుండెపై భారాన్ని తగ్గించేందుకు, గుండె చేసే పనికి సహాయకంగా ఈ కృత్రిమ గుండెను ఉపయోగిస్తారు.
టెక్సాస్ మెడికల్ సెంటర్లో ఒక వ్యక్తికి ఈ కృత్రిమ గుండెను అమర్చినట్టు టెక్సాస్ హార్ట్ ఇన్స్టిట్యూట్, బైవాకోర్ శుక్రవారం ప్రకటించాయి. టైటానియంతో ఈ కృత్రిమ గుండెను తయారు చేశారు. ఈ కృత్రిమ గుండె పూర్తిగా అసలైన గుండె స్థానంలో అమర్చడానికి ఉపయోగపడదు. గుండె విఫలమయ్యే ముప్పున్న వారికి వేరొకరి గుండెను అమర్చే వరకు సహాయకారిగా పని చేస్తుంది.