Singapore : సింగపూర్లో ఏకాదశ రుద్రాభిషేకం(Ekadasha Rudrabhishekam) శాస్త్రోక్తంగా జరిగింది. భాద్రపద శుద్ధ పాడ్యమి నాడు (శనివారం 16వ తేదీన) 40 మందికి పైగా రుత్వికులు ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేషమైన స్పందన లభించింది. అక్కడ నివసిస్తున్న తెలుగు బ్రాహ్మణలు(Telugu Brahmins) పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ మహా క్రతువును విజయవంతం చేశారు.
రుద్రాభిషేకానికి విచ్చేసిన మహిళలు లలితా పారాయణం(Lalitha Parayanam), సౌందర్య లహరి, లింగాష్టక పఠనం, హారతి గానంతో అందరిని మంత్రముగ్దులను చేశారు. అంతేకాదు ఈ సందర్భంగా మహిళలు శ్రేష్ఠమైన తీర్ధ ప్రాసాదాలు, తెలుగింటి సాంప్రదాయ ప్రసాద విందుని ఏర్పాటు చేసారు.
‘లోకాసమస్త సుఖినో భవంతు’ అనే మహా సత్సంకల్పంతో.. మన ఋషులు వేద ప్రమాణంగా నిర్దేశించిన దిశను, సాంప్రదాయ, అనుష్ఠానాలని కొనసాగించాలన్న ఉద్దేశంతో సింగపూర్లో నివసించే కొంతమంది తెలుగు బ్రాహ్మణులు ఒక సమూహంగా ఏర్పడ్డారు. ధర్మ నిరతి, ధర్మ అనుష్టానం కోసం 2014 నుంచి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఏకాదశ రుద్రాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు బ్రాహ్మణులు
నిత్య సంధ్యావందనం, లక్ష గాయత్రి హోమం(Lakshya Gayathri Homam), సామూహిక సత్యనారాయణస్వామి వ్రతం(Satyanarayana Vratam), మాస శివరాత్రి సందర్భంగా రుద్రాభిషేకం వంటి వాటిని ఇప్పటికీ విజయవంతంగా కొనసాగిస్తున్నారు.