దుబాయ్ ఎయిర్ షోలో విన్యాసాలు నిర్వహిస్తుండగా.. కూలిన తేజస్ యుద్ధ విమానం
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో శుక్రవారం జరిగిన దుబాయ్ ఎయిర్ షో-2025లో పాల్గొన్న భారతీయ వైమానిక దళానికి(ఐఏఎఫ్) చెందిన తేజస్ యుద్ధ విమానం కూలిపోయింది. అందులోని పైలట్ మరణించాడు. పైలట్‌ను వింగ్ కమాండర్ నమాంశ్ సయాల్గా గుర్తించారు.
- పైలట్ నమాంశ్ సయాల్ దుర్మరణం
- ముందు రోజే ఆయిల్ లీకేజీ వీడియోలపై పీఐబీ ఖండన
న్యూఢిల్లీ, నవంబర్ 21: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో శుక్రవారం జరిగిన దుబాయ్ ఎయిర్ షో-2025లో (Dubai Air Show) పాల్గొన్న భారతీయ వైమానిక దళానికి(IAF) చెందిన తేజస్ యుద్ధ విమానం (Tejas Fighter jet) కూలిపోయింది. అందులోని పైలట్ మరణించాడు. పైలట్‌ను వింగ్ కమాండర్ నమాంశ్ సయాల్గా గుర్తించారు. కంగ్రాకు చెందిన సయాల్ మృతి పట్ల హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖూ ప్రగాఢ సంతాపం ప్రకటించారు.
తేజస్ యుద్ధ విమానాన్ని నడుపుతున్న పైలట్‌కు తీవ్ర గాయాలై మరణించినట్లు ఐఏఎఫ్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో తెలిపింది. ప్రమాదానికి గల కారణాన్ని కనుగొనేందుకు కోర్టు ఆఫ్ ఇంక్వైరీని నియమిస్తున్నట్లు ఐఏఎఫ్ పేర్కొంది. అయితే దుబాయ్ ఎయిర్‌షోలో పాల్గొన్న ఓ తేజస్ యుద్ధ విమానం నుంచి చమురు లీకవుతున్నట్లు సామాజిక మాధ్యమాల్ల్లో వైరల్ అయిన వార్తలను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ విభాగం కొట్టివేసిన మరుసటి రోజే తేజస్ యుద్ధ విమానం ఎయిర్‌షోలో కూలిపోవడం గమనార్హం.
విన్యాసాలు నిర్వహిస్తుండగా..
దుబాయ్ వరల్డ్ సెంట్రల్‌లోని మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ప్రేక్షకుల కోసం గగనంలో విన్యాసాలు నిర్వహిస్తుండగా స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.10 గంటల ప్రాంతంలో తేజస్ విమానం కూలిపోయింది. భూమిపైకి వేగంగా దూసుకొచ్చిన విమానం నేలను తాకిన మరుక్షణం పేలిపోయింది. కిందకు వచ్చే సమయంలో పైలట్ బయటపడిన దృశ్యాలేవీ కనిపించలేదు. వెంటనే అత్యవసర సర్వీసు సిబ్బంది విమానం కూలిన ప్రదేశానికి హుటాహుటిన తరలి వెళ్లారు. ద్వైవార్షిక దుబాయ్ ఎయిర్ షోని నగరంలోని రెండవ విమానాశ్రయం నిర్వహిస్తోంది. ఎమిరేట్స్, దాని అనుబంధ ఎయిర్‌లైన్ ఫ్లై దుబాయ్ నుంచి విమానాల కొనుగోలు కోసం ఈ ఎయిర్ షో నిర్వహిస్తున్నారు. తేజస్ యుద్ధ విమానాలను ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ డిజైన్ చేయగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) తయారుచేసింది.
విదేశీ ఇంజిన్‌తో నడిచే తేజస్ భారత్‌లో తయారైన మొదటి స్వదేశీ యుద్ధ విమానం. ప్రస్తుతం ఎంకే1 రకం తేజస్ ఫైటర్ జెట్లను ఐఏఎఫ్ ఉపయోగిస్తోంది. ఎంకే1ఏ రకం ఫైటర్ జెట్ల రాక కోసం ఎదురుచూస్తోంది. 2010వ దశకంలో ఐఏఎఫ్‌లోకి చేర్చుకున్న తర్వాత తేజస్ కూలిపోవడం ఇది రెండవసారి. గత ఏడాది మార్చిలో జైసల్మేర్ సమీపంలో తేజస్ ఫైటర్‌జెట్ కూలిపోయింది. అయితే పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. హెచ్ఏఎల్ నుంచి 97 తేజస్ ఫైటర్ జెట్లను ఐఏఎఫ్ సమీకరించనున్నది.
ఈ ఏడాది సెప్టెంబర్‌లో రక్షణ మంత్రిత్వ శాఖ ఇందు కోసం హెచ్ఏఎల్తో ఒప్పందం కుదుర్చుకుంది. 2027లో వాటి సరఫరా ప్రారంభం కావలసి ఉంది. కాగా, 2021లో ఐఏఎఫ్ కోసం 83 తేజస్ విమానాలను కొనుగోలు చేసేందుకు హెచ్ఏఎల్తో రక్షణ శాఖ మరో ఒప్పందం కుదుర్చుకుంది. గత ఏడాదిలో వీటి సరఫరా జరగాల్సి ఉన్నప్పటికీ ఇంజిన్ల కొరత కారణంగా ఆలస్యమైంది. తేజస్‌కు అవసరమైన ఇంజిన్లు అమెరికా నుంచి దిగుమతి చేసుకోవలసి ఉంటుంది.
ఏం జరిగి ఉంటుంది?
తేజస్ కూలిపోవడం వెనుక కారణం ఏమై ఉంటుందన్న ప్రశ్న ఇప్పుడు అందరినీ వేధిస్తోంది. అయితే దీనికి నిపుణుల అంచనా ప్రకారం బారెల్ రోల్‌గా వ్యవహరించే ఓ విన్యాసాన్ని పైలట్ నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగి ఉంటుంది. విమానం తలకిందులుగా పయనించి మళ్లీ యథాస్థితికి రావడాన్ని బారెల్ రోల్ అని పిలుస్తారు. ఈ విన్యాసంలో విమానం పూర్తిగా తలకిందులై కొద్ది సేపటి తర్వాత పైకి లేచి తిరిగి పూర్వ స్థితికి వస్తుంది.
ఈ సమయంలో పైలట్ కూడా కొద్ది సేపు తలకిందుల స్థితిలోనే విమానాన్ని నడపవలసి ఉంటుంది. శుక్రవారం ఎయిర్‌షోలో తేజస్‌ను నడుపుతున్న పైలట్ కూడా ఇదే విన్యాసం చేసేందుకు ముందుగా విమానాన్ని పైకి లేపాడు. విమానాన్ని తలకిందులు చేసి కిందకు తీసుకువచ్చాడు. అయితే తిరిగి పైకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించిన సమయంలో అది సాధ్యంకాకపోవడంతో విమానం వేగంగా భూమి పైకి దూసుకువచ్చి ఉంటుందని నిపుణులు అంచనా వేశారు. అయితే ప్రమాదానికి కారణాన్ని ఐఏఎఫ్ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

