న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్లో ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆ దేశ ప్రధానిగా ముల్లా మొహమ్మద్ హసన్ అఖుండ్ బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా ఎవరికీ తెలియని అఖుండ్.. ఐక్యరాజ్యసమితి ఉగ్రవాద జాబితాలో ఉన్నారు. అఖుండ్ను ప్రధాని చేసేందుకు తాలిబన్లు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. తాలిబన్ల లీడర్షిప్ కౌన్సిల్ రెహబారీ షురాకు ఆయన 20 ఏళ్ల పాటు నాయకత్వం వహించారు. 2001లో అమెరికాతో యుద్ధం ఆరంభం కావడానికి ముందు ఆఫ్ఘనిస్తాన్లో మంత్రిగా చేశారు. మిలిటరీ నేతలా కాకుండా.. ఎక్కువ శాతం మతపరమైన ఆదేశాలు ఇస్తుంటారు. తాలిబన్ ఆధ్మాత్మిక నేత షేక్ హిబాతుల్లా అఖుండ్జాకు చాలా సన్నిహితుడు. తాలిబన్లు పుట్టిన కాందహార్ ఆయన జన్మస్థలం. సాయుధ పోరాటం చేపట్టిన తాలిబన్ వ్యవస్థాపక సభ్యుల్లో ఆయన ఒకరు.