Sydney mall attack : సిడ్నీలో వెస్ట్‌ఫీల్డ్ షాపింగ్ మాల్లో నిందితుడు మహిళలే లక్ష్యంగా దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. నిందితుడు మొత్తం ఆరుగురిని పొడిచిచంపగా అందులో ఐదుగురు మహిళలే ఉన్నారని, అదేవిధంగా 12 మందిని గాయపర్చగా వారిలో కూడా ఎక్కువ మంది మహిళలేనని చెప్పారు. షాపింగ్ మాల్లో చొరబడిన నిందితుడు దాదాపు అరగంటపాటు మారణకాండను కొనసాగించాడని వెల్లడించారు.
అయితే నిందితుడు క్వీన్స్‌లాండ్‌కు చెందిన 40 ఏళ్ల జోయెల్ కౌచీగా గుర్తించిన పోలీసులు.. అతడు మహిళలే లక్ష్యంగా ఎందుకు దాడికి పాల్పడ్డాడనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు హత్య చేసిన వాళ్లలో ఒకరిని చైనాకు చెందిన విద్యార్థిని యియువాన్ చెంగ్ గుర్తించారు. మిగిలిన వాళ్లలో ఒక డిజైనర్, ఒక స్వచ్ఛంద సేవకురాలు, ఒక పారిశ్రామికవేత్త కుమార్తె, ఒక 9 నెలల పాప తల్లి ఉన్నారు. మరో వ్యక్తి పాకిస్థాన్‌కు చెందిన 30 ఏళ్ల సెక్యూరిటీ గార్డు ఫరాజ్ తాహిర్గా గుర్తించారు.