బెర్న్: గత ఏడాది మిస్ స్విట్జర్లాండ్(Miss Switzerland) మోడల్.. 38 ఏళ్ల క్రిస్టినా జాక్సిమోవిక్ దారుణంగా హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆ హత్య కేసులో ఆమె భర్త థామస్‌పై నేరాభియోగాలు నమోదు చేశారు. మిస్ స్విట్జర్లాండ్ ఫైనలిస్టు అయిన క్రిస్టినాను గొంతు పిసికి చంపిన భర్త ఆ తర్వాత ఆమె శరీరాన్ని ముక్కలు చేశాడు. పదునైన కత్తితో శరీర భాగాలను చిన్నచిన్నగా కోసేశాడు. తన దగ్గర ఉన్న కత్తులతో ఆ మోడల్ గర్భాన్ని కూడా తొలగించినట్లు తెలిసింది. కొన్ని శరీర భాగాలను మిక్సీలో పట్టి, కెమికల్ సొల్యూషన్‌లో కలిపినట్లు దర్యాప్తులో తేల్చారు.
స్విట్జర్లాండ్‌లోని బిన్నింజెన్ సిటీలో 2024 ఫిబ్రవరిలో ఆ హత్య జరిగింది. థామస్ వాడిన బ్లెండర్, కత్తులకు మాంసం అతుక్కుని ఉన్నట్లు పోలీసులు పసికట్టారు. యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ థామస్ తన భార్య శరీరాన్ని ముక్కలు చేసినట్లు కోర్టు డాక్యుమెంట్ల ద్వారా తెలిసింది. లాండ్రీ రూమ్‌లో క్రిస్టినా వెంట్రుకలు ఉన్నట్లు ఆ మోడల్ తండ్రి మొదట గుర్తించాడు. తన భార్య సహజంగా చనిపోయినట్లు థామస్ తొలుత నమ్మించాడు. కానీ ఆమెను హత్య చేసినట్లు ఆ తర్వాత అంగీకరించాడు.
కత్తితో తనపై భార్య అటాక్ చేసిందని, ఆ సమయంలో ఆత్మరక్షణ కోసం ప్రతిదాడి చేసినట్లు థామస్ చెప్పాడు. ఫోరెన్సిక్ నిపుణులకు ఎటువంటి ఆధారాలు దొరక్కపోవడంతో.. గొంతునొక్కి చంపినట్లు నిర్ధారణకు వచ్చారు. క్రిస్టినా-థామస్ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. క్రిస్టినా గతంలో మిస్ నార్త్‌వెస్ట్ స్విట్జర్లాండ్ కిరీటాన్ని గెలుచుకున్నది. 2007లో ఆమె మిస్ స్విట్జర్లాండ్ పోటీల్లో ఫైనలిస్టుగా నిలిచింది. ఆ తర్వాత ఆమె అనేక మంది మోడళ్లకు కోచ్‌గా చేసింది.