న్యూయార్క్: అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. డోనాల్డ్ ట్రంప్(Donald Trump)కు అనుకూలంగా తీర్పును ఇచ్చింది. దేశాధ్యక్షుడు ఇచ్చే ఎగ్జిక్యూటివ్ ఆదేశాలను అడ్డుకునే అధికారం దిగువ కోర్టులకు లేదని సుప్రీం స్పష్టం చేసింది. దీంతో ట్రంప్‌తో పాటు కాబోయే అమెరికా అధ్యక్షులకు కూడా ఈ అంశంలో రక్షణ లభించింది. సుప్రీంకోర్టు అద్భుతమైన తీర్పును ఇచ్చిందని వైట్‌హౌజ్‌లో ట్రంప్ వెల్లడించారు. తమ ప్రభుత్వం ఆ తీర్పు పట్ల సంతోషంగా ఉందన్నారు. ఇది రాజ్యాంగపరమైన విజయం అని ఆయన పేర్కొన్నారు. సుప్రీం తీర్పుతో ట్రంప్ జారీ చేసిన జనన పౌరసత్వ ఆదేశాలకు మద్దతు దొరికినట్లు అయ్యింది. అమెరికా నేలపై పుట్టే ప్రతిఒక్కరికీ జన్మతా పౌరసత్వం ఇవ్వరాదు అని ట్రంప్ ఓ ఆదేశం జారీ చేసిన విషయం తెలిసిందే. కోర్టు తాజా ఆదేశాలతో ఆ నియమాన్ని అమలు చేసేందుకు వైట్‌హౌజ్‌కు మార్గం సుగమైంది.
ఇక క్యాపిటల్ హిల్ దాడి కేసులో ట్రంప్‌కు వ్యతిరేకంగా విచారణ చేపట్టిన ముగ్గురు ప్రాసిక్యూటర్లను న్యాయశాఖ తొలిగించింది. 2021, జనవరి ఆరో తేదీన ట్రంప్ ఓటమి వేళ.. క్యాపిటల్ హిల్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ ఘటనపై నమోదు అయిన కేసుల్లో సూపర్విజన్ చేసిన ఇద్దరు అటార్నీలను తొలగిస్తున్నట్లు ప్రభుత్వం చెప్పింది. ప్రాసిక్యూటర్లను తక్షణమే తొలగిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసినా.. దాంట్లో ఆ ఘటనకు కారణాలను వెల్లడించలేదు.