కాలిఫోర్నియా: కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రపంచమంతా ఇప్పుడు సౌర విద్యుత్తు సహా పలు ప్రత్యామ్నాయ విద్యుత్తు ఉత్పత్తి విధానాలపై దృష్టి సారిస్తున్నది. స్థలాభావం సౌర విద్యుత్తు ఉత్పత్తికి ప్రధాన సవాల్. ఈ విద్యుదుత్పత్తికి సౌర ఫలకలను భూమిపై కొంచెం ఎత్తులో అడ్డంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. తక్కువ విద్యుత్తు ఉత్పత్తికి ఎక్కువ స్థలం అవసరం పడుతుంది.
ఈ సమస్యకు పరిష్కారంగా అమెరికాకు చెందిన సన్స్టాల్ అనే సంస్థ నిలువు సౌర ఫలకలను తీసుకువచ్చింది. ఇవి వ్యవసాయ భూముల్లో ఏర్పాటు చేయడం వల్ల భూములకు సరిహద్దులుగా ఉంటాయని, తీవ్ర ఎండల నుంచి పంటలను కాపాడటంతో పాటు పంటలకు సాగు నీటి అవసరాన్ని కూడా తగ్గిస్తాయని ఈ సంస్థ చెప్తున్నది. నిలువు సౌర ఫలకలను ఏర్పాటుచేసినా వ్యవసాయం చేయడానికి ఎలాంటి ఆటంకం ఉండదని అంటున్నది. ఈ ఫలకలను నిలువుగా 15 డిగ్రీల వాలుతో ఏర్పాటు చేయాలని సన్స్టాల్ సంస్థ తెలిపింది. కేవలం వ్యవసాయ భూముల్లో మాత్రమే కాదు హైవేలు, రైల్వేలైన్ల పొడవునా వీటిని ఏర్పాటు చేయవచ్చని, ఇండ్లలో బాల్కనీలు, ఫెన్సింగ్లకు కూడా పెట్టవచ్చని అంటున్నది.