బ్రాటిస్లవా: స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫికో(Robert Fico).. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల ఆయనపై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. బనస్కా బిస్ట్రికా నగరంలోని ఆస్పత్రికి చెందిన డైరెక్టర్ మిరయం లపునికోవా ఈ విషయాన్ని ద్రువీకరించారు. ప్రధాని ఫికోను ఇంటికి పంపించామని, ఆయన అక్కడ త్వరలో కోలుకుంటారని మిరియం వెల్లడించారు. ఆస్పత్రిలో చాలా క్రమశిక్షణ గల పేషెంట్‌గా ఉన్న ఫికోకు ఆయన థ్యాంక్స్ తెలిపారు.
మే 15వ తేదీన ఫికోపై అటాక్ జరిగింది. మద్దతుదారులకు గ్రీటింగ్ ఇస్తున్న సమయంలో ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. హండ్లోవా పట్టణంలో ఈ అటాక్ జరిగింది. సమీప నగరంలోని ఆస్పత్రిలో ఆయనకు తొలుత అయిదు గంటల పాటు సర్జరీ చేశారు. మళ్లీ రెండు రోజుల తర్వాత రెండు గంటల పాటు శస్త్రచికిత్స చేశారు. గన్‌తో కాల్పులు జరిపిన వ్యక్తిని 71 ఏళ్ల కవి జురాజ్ సింటులాగా గుర్తించారు. అతనిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి కస్టడీలోకి తీసుకున్నారు.