మెక్సికో: భద్రత కోసం సాధారణంగా ఎయిర్‌పోర్టులు, మెట్రోస్టేషన్లలో చెకింగ్ మెషిన్లను ఏర్పాటు చేస్తారు. ఏ దేశంలోనైనా ఈ తనిఖీలు సర్వసాధారణమే. అయితే, ఈ తనిఖీల సందర్బంగా అప్పుడప్పుడు వింతలు బయటపడుతుంటాయి. లగేజీల్లో, దుస్తుల్లో, ఆఖరికి మర్మాంగాల్లో స్మగుల్డ్ గూడ్స్‌ను రవాణా చేయబోయి ఎంతో మంది పట్టుబడుతుంటారు. ఇదీ సాధారణమే. కానీ, మెక్సికో ఎయిర్‌పోర్టులో అధికారులు.. కొరియర్ బాక్సులను తనిఖీ చేస్తుండగా కనిపించిన వస్తువులను చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
కొరియర్ బాక్సుల్లో వచ్చిన సూట్‌కేసులను అధికారులు చెకింగ్ మిషన్ల సాయంతో తనిఖీ చేస్తుండగా.. వాటిలో మనిషి పుర్రెలు ఉన్నట్లు ఎయిర్‌పోర్టు ఎక్స్‌రే మిషన్ గుర్తించింది. అధికారులు ఆ సూట్‌కేసును ఓపెన్ చేసి చూడగా దానిలో నాలుగు మానవ పుర్రెలు కనిపించాయి. వాటిని చూసి షాకవడం అధికారుల వంతయ్యింది. సంబంధిత డాక్యుమెంట్ల ఆధారంగా మెక్సికోలోని అత్యంత హింసాత్మక రాష్ట్రాల్లో ఒకటైన మిచోవాకాన్ నుంచి దక్షిణ కరోలినాకు ఆ పుర్రెలను కొరియర్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
కాగా, కొరియర్లో పుర్రెలు రావడంపై ఎయిర్‌పోర్టు అధికారులు ఎంక్వయిరీ మొదలుపెట్టారు. ఎవరు పుంపుతున్నారు..? ఎవరికి పంపుతున్నారు..? దేని కోసం పంపుతున్నారు..? అనే కోణంలో దీనిపై దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.