Russian Soldiers | కీవ్: తూర్పు ఉక్రెయిన్లోని రష్యా సైనికులు చలికాలంలో ఆహార కొరత వల్ల నరమాంస భక్షకులుగా మారి తోటి సైనికులను చంపి తింటున్నారని ఉక్రెయిన్ ఆరోపించింది. అటువంటి ఘటనలు కనీసం ఐదు తమ దృష్టికి వచ్చాయని ఉక్రెయిన్ నిఘా వర్గాలు తెలిపాయి.
2025 నవంబర్లో డొనెట్స్ ప్రాంతంలోని మర్నోహ్రాడ్ సమీపంలో ఖ్రోమోయ్ అనే సైనికుడు తన సహచర సైనికులు ఇద్దరిని చంపి వారిలో ఒకరి కాళ్లను తినడానికి ప్రయత్నించినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. నరికిన కాలు ఫొటోలను టెలిగ్రామ్ ద్వారా తన కమాండర్లకు ఒక గుర్తు తెలియని అధికారి షేర్ చేశాడు. ఒక బేస్మెంట్లో తోటి సైనికుడి శరీర భాగాలను తినేందుకు ప్రయత్నస్తున్న ఖ్రోమోయ్ను నిర్బంధించేందుకు ప్రయత్నించగా జరిగిన కాల్పుల్లో అతను మరణించినట్లు ఆ అధికారి తన కమాండర్లకు వివరించాడు.
చనిపోయిన సైనికుల మృతదేహాలను పరిశీలించిన ఓ సైనిక సర్జన్ శరీరంపై ఉన్న గాయాలు యుద్ధం వల్ల ఏర్పడిన గాయాలు కావని, పదునైన వస్తువుతో కోసినవని తెలిపారు. రష్యా సైనికులు తీవ్ర ఆహార కొరతతో అల్లాడుతున్నట్లు ఆ అధికారి పేర్కొన్నారు. మరో ఘటనలో ఒక సైనికుడు తన తోటి సైనికుడు మానవ మాంసం తినడం గురించి ఫిర్యాదు చేశాడు. అతను గనక మనిషే అయితే తనకు నచ్చినంత కాలం ఇక్కడ ఉండొచ్చు. కానీ అతను ఒక శవాన్ని తిన్నాడు అని ఆ సైనికుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ నివేదికల మధ్య ఒక యూనిట్ కమాండర్ తన కింది అధికారిని నరమాంస భక్షణకు వ్యతిరేకంగా హెచ్చరిస్తూ మనుషులను తినడం ఆపండి అని ఆదేశించాడు. అయితే ఈ ఆరోపణలను లండన్లోని రష్యాన్ ఎంబసీ కొట్టివేసింది.