ఇస్లామాబాద్: పాకిస్థాన్ 24వ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్(Shehbaz Sharif) ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. దేశాధ్యక్షుడు అరిఫ్ అల్వీ ఆ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి నవాజ్ షరీఫ్, మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారి, పీపీపీ చైర్మెన్ బిలావాల్ భుట్టో హాజరయ్యారు. అధ్యక్ష భవనంలో ఈ ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. పీఎంఎల్-ఎన్, పీపీపీ మధ్య అధికారం కోసం డీల్ జరిగిన తర్వాతే ప్రధానిగా షెహబాజ్ ప్రమాణం చేశారు. కొత్తగా దేశాధ్యక్ష బాధ్యతలను అసిఫ్ అలీ జర్దారి చేపట్టనున్నారు.
గతంలోనూ షెహబాజ్ పాక్ ప్రధానిగా చేశారు. ఏప్రిల్ 2022 నుంచి ఆగస్టు 2023 వరకు ఆయన తొలిసారి ప్రధాని బాధ్యతలను నిర్వర్తించారు. గత నెలలో జాతీయ అసెంబ్లీకి ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ప్రధానిగా ఇవాళ బాధ్యతలకు చేపట్టడానికి ముందు .. షెహబాజ్‌కు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు.