మాస్కో: ఒకవైపు ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తూనే రష్యా తన అత్యాధునిక ఆయుధాలను పరీక్షిస్తున్నది. తాజాగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి(ICBM)ని విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. ఇంటర్కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్‌ను పరీక్షించినట్లు చెప్పింది. ఆర్కన్గెల్క్సీ ప్రాంతంలో పెసస్కీ కాస్మోడీటోమ్ నుంచి వార్‌హెడ్‌ను పరీక్షించారు. అయితే ఆ క్షిపణి ఈశాన్య దిక్కుకు ప్రయాణించింది. కామచటక్కా ద్వీపకల్పంలోని కురా ట్రైనింగ్ రేంజ్ మీదుగా ఆ ఖండాంతర క్షిపణి వెళ్లినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. అనుకున్న లక్ష్యాలు అందుకున్నట్లు ప్రకటించారు.
మిస్సైల్ పర్ఫార్మెన్స్తో పాటు ఫ్లయిట్ పారామీటర్స్ చెక్ చేశారు. అయితే ఈ పరీక్ష కోసం ఎటువంటి మ్యునిషన్ వాడారన్న విషయాన్ని రక్షణ శాఖ వెల్లడించలేదు. దీన్ని మొబైల్ లాంచ్ సాలిడ్ ఫ్యూయల్ సిస్టమ్‌గా పేర్కొన్నారు. రక్షణశాఖకు చెందిన వ్యూహాత్మక క్షిపణి దళం ఈ పరీక్ష చేపట్టిందన్నారు. మొబైల్ ఐసీబీఎం లాంచ్ బ్యాటరీని ఓ రిమోట్ ఏరియాలో ఉంచి.. అక్కడ నుంచి లాంచ్ చేసినట్లు అధికారులు చెప్పారు.
మే నెలలో ఆర్ఎస్-28 సర్మాత్ ఐసీబీఎంను రష్యా పరీక్షించిన విషయం తెలిసిందే. ఆ క్షిపణి కనీసం 10 భారీ వార్‌హెడ్స్‌ను మోసుకెళ్లగలదు. సర్మాత్ ధ్వని వేగం కన్నా అధిక వేగంతో ప్రయాణిస్తుంది. అవన్గార్డ్ అనే మరో రష్యన్ మిస్సైల్ సిస్టమ్‌కు దీన్ని వాడుతారు.