మాస్కో, ఫిబ్రవరి 21: ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభమై ఏడాది పూర్తవుతున్న సమయంలో ఆందోళనకర పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఒకవైపు యుద్ధక్షేత్రంగా ఉన్న ఉక్రెయిన్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆకస్మికంగా పర్యటించిన మరునాడే రష్యా అణ్వాయుధ ప్రయోగాల పునరుద్ధరణకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. గతంలో అణ్వాయుధాల పరిమితికి అమెరికాతో చేసుకున్న ఒప్పందం నుంచి తాత్కాలికంగా తప్పుకుంటున్నట్టు ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన ప్రకటన చేశారు. జాతినుద్దేశించి మాట్లాడిన పుతిన్.. ఉక్రెయిన్‌లో రష్యా ఓడిపోవడమే లక్ష్యమని అమెరికా, నాటో దళాలు బహిరంగంగా ప్రకటిస్తున్నాయన్నారు. ఆ దేశాలు తాము ఓడిపోవాలని కోరుకుంటున్నాయని, తమ దేశ అణు కేంద్రాలను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని పుతిన్ ఆరోపించారు. రష్యా ఎయిర్‌బేస్‌లపై ఉక్రెయిన్ చేస్తున్న డ్రోన్ దాడులకు నాటో దేశాలు సహకరిస్తున్నాయన్నారు. అమెరికాతో గతంలో చేసుకున్న ‘న్యూ స్టార్ట్ ఒప్పందం’ నుంచి తాత్కాలికంగా తప్పుకొంటున్నామని, అమెరికా ఇలానే వ్యవహరిస్తే అణ్వాయుధాల ప్రయోగాల పునరుద్ధరణకు కూడా సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు.
ఏమిటీ ‘న్యూ స్టార్ట్’
ప్రపంచానికి ముప్పుగా మారిన అణ్వాయుధాలపై పరిమితి ఉండాలని 2010లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, రష్యా అధ్యక్షుడు మెద్వెదెవ్ ‘న్యూ స్టార్ట్’ ఒప్పందం చేసుకున్నారు. దీని ప్రకారం ఈ దేశాలు 1,550 అణు వార్హెడ్లు, 700 క్షిపణులు, బాంబర్లకు మించి మోహరించవద్దని పరిమితి విధించారు. ఈ ఒప్పందం 2021 ఫిబ్రవరిలో ముగియాల్సి ఉండగా మళ్లీ ఐదేండ్ల పాటు పొడిగించాయి. ఈ ఒప్పందం ప్రకారం ఒక దేశంలో మరో దేశం తనిఖీలు చేయాల్సి ఉంటుంది. అయితే, కరోనా కారణంగా గత మూడేండ్లుగా ఈ తనిఖీలు జరగడం లేదు. ఇటీవల తనిఖీలకు అమెరికా పట్టుబడుతున్నది. కానీ, ఒకవైపు ఉక్రెయిన్‌కు మద్దతిస్తూ తమ దేశ ఆయుధ కేంద్రాలను ఎలా తనిఖీ చేస్తారని రష్యా అంగీకరించడం లేదు.