రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కి రివర్స్ ఝలక్ ఇచ్చారు. ఉక్రెయిన్‌పై బాంబులతో విరుచుకుపడుతున్న రష్యాపై అమెరికా పలు కఠిన ఆంక్షలు విధిస్తూ… పుతిన్‌పై రోజూ ఏదో రకంగా మాటల దాడి చేస్తూనే వుంది. దీంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ మంగళవారం.. అమెరికాకు రివర్స్ ఝలక్ ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్, హిల్లరీ క్లింటన్‌తో సహా పలువురు ఉన్నతాధికారులపై ఆంక్షలు విధిస్తూ పుతిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్, హిల్లరీ క్లింటన్‌తో సహా మరో 12 మంది రష్యాలోకి ప్రవేశించడానికి వీల్లేదని పుతిన్ ఆదేశాలు జారీచేశారు. ఈ విషయాన్ని రష్యా విదేశాంగ శాఖ ప్రకటించింది. ఇలా చేయడం అమెరికాపై ప్రతీకారం తీర్చుకున్నట్లేనని పలువురు భావిస్తున్నారు.
ఉక్రెయిన్‌పై దాడులు చేస్తున్న రష్యాపై అమెరికా ఆంక్షల తీవ్రతను పెంచింది. రష్యా నుంచి దిగుమతి చేసుకొంటున్న ముడి చమురుపై నిషేధం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొన్ని రోజుల క్రితం నిర్ణయం తీసుకున్నారు. ‘రష్యా నుంచి ముడి చమురు, గ్యాస్, ఎనర్జీ దిగుమతులపై నిషేధం విధిస్తున్నాం’ అన్నారు. రష్యా నుంచి దిగుమతులు ఆగిపోతే ఆ దేశానికి నిధుల కొరత ఏర్పడుతుందని పేర్కొన్నారు. తమతో పోలిస్తే ఐరోపా దేశాలు రష్యా చమురు ఉత్పత్తులపై ఎక్కువగా ఆధారపడ్డాయని పేర్కొన్న బైడెన్.. తాజా ఆంక్షల విషయంలో ఆయా దేశాలు తమతో కలిసి రాకపోయినా అర్థం చేసుకొంటామన్నారు.